గుండెలు పిండేసే విషాదంలోనూ ఓ కుటుంబం మానవత్వం!
Advertisement
గుండెలు పిండేసే విషాదం...కంటికొలనులో నిండిన కన్నీటి ధారలు... అందివచ్చిన బిడ్డ అందనిలోకాలకు తరలిపోతున్నాడన్న పుట్టెడు దుఃఖంలోనూ ఆ కుటుంబం తన మానవతావాదాన్ని, సేవాదృక్పథాన్ని చాటుకుంది. బిడ్డ దూరమైనా అతని అవయవాలు నిర్జీవం కాకూడదన్న తాపత్రయంతో దానానికి అంగీకరించి పెద్దమనసు చాటుకున్నారు.

వివరాల్లోకి వెళితే...తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన ముదునూరి సత్యసూర్యనారాయణ రాము (24) ఈ నెల మోటారు సైకిల్‌పై వెళ్తూ ప్రమాదం బారినపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కాకినాడలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు రాము బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు తెలిపారు.

వారు అవయవ దానానికి ముందుకు రావడంతో రాత్రి ఎనిమిది గంటల సమయంలో కాకినాడ అపోలో ఆస్పత్రి వైద్యులు రాము దేహం నుంచి గుండె, కాలేయం, కార్నియా వేరు చేశారు. గుండెను ప్రత్యేక అంబులెన్స్‌లో రాజమండ్రి పంపించి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై మీదుగా కోల్‌కతా తీసుకువెళ్లారు. కాలేయాన్ని రోడ్డు మార్గంలో విశాఖ తరలించారు. కార్నియాను కాకినాడలోని బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు అప్పగించారు.

 రాము తండ్రి శివరామరాజు ప్రైవేటు ఉద్యోగి. పదో తరగతి వరకు చదువుకున్న రాము ఇంట్లో తల్లిదండ్రులకు సహాయకారిగా ఉండేవాడు. అతని మరణంతో ఆ కుటుంబం తీవ్రవిషాదంలో కూరుకుపోయింది.  
Mon, Sep 24, 2018, 10:49 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View