ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దు.. మిర్యాలగూడలో నిరసనలు!
Advertisement
మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన భార్య అమృత డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దంటూ మిర్యాలగూడలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక మినీ రవీంద్రభారతిలో తల్లిదండ్రుల సంఘం ప్రతినిధులు నిన్న సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు కర్నాటి ప్రభాకర్, న్యాయవాది చిలుకూరి శ్యామ్ మాట్లాడుతూ, ప్రణయ్ హత్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇది రెండు కుటుంబాలకు చెందిన సమస్య అని... దీన్ని కులాలకు సంబంధించిన సమస్యగా మార్చి, సమాజంలోని అందరికీ ఆపాదించడం సరికాదని అన్నారు. ప్రణయ్ విగ్రహాన్ని వారి సొంత స్థలంలో ఏర్పాటు చేసుకుంటే ఎవరికీ ఇబ్బంది లేదని... అందరూ తిరిగే కూడలిలో ఏర్పాటు చేస్తే, భవిష్యత్తు తరాలకు చెడు సందేశం వెళుతుందని చెప్పారు. ప్రజల మధ్య అంతరాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. అనంతరం అక్కడ నుంచి ర్యాలీగా బయల్దేరి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి, నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి, విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దంటూ వినతిపత్రం అందజేశారు.
Mon, Sep 24, 2018, 07:30 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View