మమ్మల్ని రక్షించండి.. పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట!
Advertisement
తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ కులాంతర వివాహం చేసుకున్న ఒక ప్రేమ జంట హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. వీరి వివాహానికి వరుడి తల్లిదండ్రులు సమ్మతి తెలుపగా, వధువు బంధువులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో కేపీహెచ్బీ కాలనీలోని ఆర్య సమాజ్ లో వీరు నిన్న వివాహం చేసుకున్నారు. అనంతరం, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి, సీఐ వెంకటేశ్వరరావుకు తమ సమస్యను వివరించారు.

వధువు సోనాలి కులకర్ణి (23) తండ్రి ఈఎస్ఐలో పని చేసేవారు. ఆన్ డ్యూటీలో ఆయన మరణించగా, ఆయన ఉద్యోగాన్ని కుమార్తె సోనాలికి ఇచ్చారు. ప్రస్తుతం జీడిమెట్ల ఈఎస్ఐ డిస్పెన్సరీలో అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఆమె జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఇదే డిస్పెన్సరీలో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ (ప్రైవేట్) విభాగంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నరేందర్ (24) పని చేస్తున్నాడు. వీరిద్దరూ గత ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు.

తమ ప్రేమ విషయాన్ని తన తల్లి, బంధువుల వద్ద సోనాలి ప్రస్తావించగా... వారు వివాహానికి నిరాకరించారు. దీంతో, వారం క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి, నిన్న ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారు. తమ వివాహాన్ని తమ బంధువు ఒకరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఆయన నుంచి తమకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సోనాలి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, అమ్మాయి తల్లి, కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా వారికి ఇప్పటికే సమాచారం ఇచ్చారు. 
Mon, Sep 24, 2018, 07:04 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View