మావోయిస్టులు వాళ్లిద్దరి చేతులు వెనక్కి కట్టేసితీసుకెళ్లారు: సోమ కారు డ్రైవర్ చిట్టిబాబు
Advertisement
ఇరవై మంది మావోయిస్టులు తమ వాహనానికి అడ్డుపడ్డారని, తప్పించుకోవాలని చూస్తే చాలా దారుణంగా ఉంటుందని మావోయిస్టులు హెచ్చరించారని మృతుడు సోమ కారు డ్రైవర్ చిట్టిబాబు అన్నారు. అరకులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు తీసుకెళ్లడాన్ని ప్రత్యక్షంగా చిట్టిబాబు చూశారు. ఈ సంఘటన గురించి విలేకరులు ప్రశ్నించగా చిట్టిబాబు మాట్లాడుతూ, తాను ఏం చేయలేని పరిస్థితుల్లో వాహనాన్ని ఆపేశానని, ఆ తర్వాత మావోయిస్టులు తమ దగ్గరకొచ్చి ‘సోమ గారు ఎవరు?’ అని ప్రశ్నించారని అన్నారు.

అనంతరం, సోమను కారు నుంచి దింపి ఆయన చేతులు వెనక్కి కట్టేసి నడిపించుకుంటూ తీసుకెళ్లారని చెప్పారు. గన్ మన్లకు, డ్రైవర్ కు తుపాకీలు గురిపెట్టిన మావోయిస్టులు, గన్ మన్ల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఎవరైనా పారిపోవాలని చూస్తే ఎన్ కౌంటర్ చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించారని, అదేవిధంగా, సర్వేశ్వరరావును కూడా నడిపించుకుంటూ తీసుకెళ్లారని చెప్పారు.

తామెవరమూ సర్వేశ్వరరావు, సోమ వద్దకు వెళ్లే పరిస్థితి లేదని, ఎందుకంటే, తమను గన్స్ తో రౌండప్ చేశారని, దీంతో, తాము ఏం చేయలేకపోయామని,వాళ్లిద్దరినీ తీసుకెళ్లి కాల్చేశారని చెప్పారు. ‘సర్వేశ్వరరావు, సోమ చేసిన అక్రమాలు మీకు తెలియవు’ అని మావోయిస్టులు తమతో అన్న విషయాన్ని చిట్టిబాబు ప్రస్తావించారు.
Sun, Sep 23, 2018, 07:50 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View