పాత కక్షల నేపథ్యంలో తలుపుల షాపు నిర్వాహకుడి హత్య
Advertisement
హైదరాబాద్‌లోని హసన్‌నగర్‌లో తలుపుల షాపు నిర్వహిస్తున్న మహ్మద్‌ అమ్జద్‌ఖాన్‌ (50) అనే వ్యక్తిపై పాత కక్షల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి హత్యకు పాల్పడ్డారు. శాస్త్రిపురం డివిజన్‌ వట్లేపల్లి సైఫీ కాలనీకి చెందిన అమ్జద్‌ఖాన్‌ మజ్లిస్‌ కార్యకర్త. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు దుకాణం వద్దకు నడుచుకుంటూ వచ్చిన ముగ్గురు వ్యక్తులు కత్తులతో అమ్జద్‌ఖాన్‌పై దాడిచేశారు. అమ్జద్‌ఖాన్‌ తప్పించుకునే ప్రయత్నం చేయగా దుకాణంలో ఉన్న సుత్తితో తలపై మోదడంతో కుప్పకూలిపోయాడు. అమ్జద్‌ఖాన్‌ షాపు పక్కషాపులో వెల్డింగ్‌ పనిచేస్తున్న మహ్మద్‌ అవైన్‌ దాడిచూసి అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగులు కత్తులు చూపి అతన్నీ బెదిరించారు. అనంతరం దుండగులు కొద్దిదూరం వెళ్లి ఆటోలో మైలార్‌దేవ్‌పల్లి రైల్వేగేటు వైపు వెళ్లిపోయారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని అమ్జద్‌ఖాన్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అమ్జద్‌ఖాన్‌కు కొందరితో భూతగాదాలున్నాయని, అతని కొడుకు చేసే గొడవలతో కూడా ప్రమేయం ఉందని, ఇవే అతని హత్యకు దారి తీసి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఘటనా స్థలిని రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్‌ సందర్శించి వివరాలు సేకరించారు. 
Sun, Sep 23, 2018, 12:48 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View