కుల రక్కసి.. అగ్రవర్ణం అమ్మాయి చేయి పట్టుకున్నాడని కొట్టి నగ్నంగా ఊరేగించారు!
Advertisement
కులం పేరుతో ఇటీవల చోటుచేసుకున్న వరుస పరువు హత్యలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా అగ్రవర్ణానికి చెందిన అమ్మాయి చేతిని దళిత సామాజిక వర్గానికి చెందిన పిల్లాడు పట్టుకుని, ఆమెకు చాక్లెట్ ఇవ్వడం పెను దుమారానికి దారితీసింది. ఆ పిల్లాడు చేయి పట్టుకోవడంపై ఆగ్రహించిన అమ్మాయి బంధువులు అతడిని చావగొట్టారు. అనంతరం ఊరంతా నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కొల్హాపూర్ కు చెందిన ఓ పిల్లాడు(13), స్కూలు నుంచి వస్తుండగా అదే పాఠశాలలో చదువుతున్న మరో అమ్మాయి కనిపించింది. ఇరు కుటుంబాలకు అప్పటికే పరిచయం ఉండటంతో ఆ బాలుడు ఆమెకు చాక్లెట్ అందించాడు. అనంతరం ఇద్దరు చేయి పట్టుకుని కొద్దిదూరం నడిచారు. చివరికి ఎవరి ఇళ్లకువారు వెళ్లిపోయారు. అయితే చాక్లెట్ ఎవరు ఇచ్చారని ఇంట్లో అడగటంతో ఫలానా అబ్బాయి ఇచ్చాడని తెలిపింది. దారిలో కొంతదూరం చేయి పట్టుకుని నడిచామని వెల్లడించింది. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఆగ్రహోదగ్రులయ్యారు. తొలుత కుమార్తెను ముంబైలో ఉన్న బంధువుల వద్దకు పంపివేశారు.

అనంతరం శుక్రవారం సదరు బాలుడిని తమ ఇంటికి ఎత్తుకెళ్లి దారుణంగా చావగొట్టారు. అక్కడితో కోపం చల్లారకపోవడంతో బట్టలన్నీ ఊడగొట్టి నగ్నంగా ఇంటి నుంచి పంచాయితీ ఆఫీస్ వరకూ కొడుతూ ఊరేగించారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన నేపథ్యంలో కోల్హాపూర్ కు చేరుకున్న పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు  దాడికి పాల్పడ్డ అమ్మాయి బాబాయితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదుచేశారు. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీగా పోలీసులను మోహరించారు.
Sun, Sep 23, 2018, 12:29 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View