నిరుపేదకు రూ. 57 లక్షలు తెచ్చిపెట్టిన చిన్న ఫొటో!
Advertisement
ఒక చిన్న ఫొటో చూసిన వందల హృదయాలు కదిలాయి. పెద్ద దిక్కుపోయి అలమటిస్తున్న ఆ కుటుంబానికి ఏకంగా రూ. 57 లక్షలు సమకూరాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే, న్యూఢిల్లీలో అనిల్ (37) అనే ఓ పారిశుద్ధ్య కార్మికుడు విధులు నిర్వహిస్తూ మృతి చెందాడు. అతని మృతదేహం వద్ద 11 ఏళ్ల కుమారుడు రోదిస్తుండగా తీసిన ఫొటోను శివ్ సన్నీ అనే ట్విట్టర్ ఖాతాదారుడు పోస్టు చేశాడు.

 ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపు 31 వేల మంది దీన్ని షేర్ చేసుకున్నారు. దీంతో ఓ క్రౌడ్ ఫండ్ వెబ్ సైట్ లో స్వచ్ఛంద సంస్థ ఒకటి, అతని కుటుంబాన్ని ఆదుకుందామని పిలుపునిచ్చి నిధుల సేకరణ ప్రారంభించింది. వందలాది మంది స్పందించారు. ఫలితంగా కేవలం రెండు రోజుల వ్యవధిలో రూ. 57 లక్షలు పోగయ్యాయి. అనిల్ కు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఈ మొత్తాన్ని అనిల్ కుటుంబానికి అందిస్తామని స్వచ్ఛంద సంస్థ తెలిపింది.
Thu, Sep 20, 2018, 11:54 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View