ఖైరతాబాద్ టికెట్ దానం నాగేందర్ కే... హుటాహుటిన కేటీఆర్ వద్దకు విజయారెడ్డి!
Advertisement
హైదరాబాద్ నగరం మధ్యలో ఉండే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి దానం నాగేందర్ పేరు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఖైరతాబాద్ లో ప్రచారం చేసుకోవాలని పార్టీ నాయకత్వం దానంకు సూచించడంతో ఈ ప్రాంత నేత, దివంగత పీజేఆర్ కుమార్తె, అసెంబ్లీ టికెట్ ను ఆశిస్తున్న విజయారెడ్డి హుటాహుటిన కేటీఆర్ ను కలిశారు. దీంతో రాజకీయం వేడెక్కింది.

వాస్తవానికి ఖైరతాబాద్ అసెంబ్లీ బీజేపీ సిట్టింగ్ స్థానం. చింతల రామచంద్రారెడ్డి ఇక్కడి తాజా మాజీ. తిరిగి ఆయనే బీజేపీ నుంచి పోటీకి దిగనుండటంతో, దానం అయితేనే గట్టి పోటీని ఇస్తారని టీఆర్ఎస్ భావించినట్టు సమాచారం. దానంకు తొలుత బీజేపీ సిట్టింగ్ స్థానమైన గోషామహల్ ను ఇవ్వాలని భావించినా, ఆయన కోరిక మేరకు ఖైరతాబాద్ నే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న విజయారెడ్డి కేటీఆర్ ను కలిసి తన అసంతృప్తిని వ్యక్తం చేయగా, ఆయన సర్దిచెప్పే ప్రయత్నం చేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Thu, Sep 20, 2018, 11:46 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View