భార్యతో కేసులు పెట్టించిన తండ్రి, గర్భం తొలగింపు.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్యాయత్నం!
Advertisement
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఆమె తండ్రి బలవంతంగా తీసుకెళ్లిపోవడం, ఆమె చేత తన కుటుంబ సభ్యులపై అక్రమంగా పోలీస్ కేసులు పెట్టించడంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

పాతబస్తీలోని బాబా నగర్ కు చెందిన శ్రీకాంత్ నకిరేకల్ కు చెందిన శ్రీహర్ష అనే యువతిని నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖలో పనిచేస్తున్న అమ్మాయి తండ్రి షన్ముగచారి ఆమెను ఇటీవల బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం సదరు యువతిని బెదిరించి శ్రీకాంత్ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టించాడు. దీనికి తోడు ఏడు నెలల గర్భవతైన శ్రీహర్షకు ఆమె తండ్రి అబార్షన్ చేయించినట్లు తేలింది.

దీంతో ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి లోనైన శ్రీకాంత్, సూసైడ్ నోట్ వాట్సాప్ లో పెట్టి, నిన్న రాత్రి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసుకునే ముందు శ్రీకాంత్ సెల్ఫీ వీడియోను తీసుకున్నాడు. 90 శాతం కాలిన గాయాలైన శ్రీకాంత్ బతికే అవకాశాలు తక్కువేనని వైద్యులు చెబుతున్నారు.
Thu, Sep 20, 2018, 11:11 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View