రేప్ కేసును ఉపసంహరించుకుంటే 5 కోట్లిస్తా.. బాధితురాలికి బిషప్ ఆఫర్!
Advertisement
కేరళ నన్‌పై బిషప్ అత్యాచారం కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసును ఉపసంహరించుకుంటే ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడంతోపాటు, చర్చిలో ఆమె శాశ్వతంగా హాయిగా నివసించే ఏర్పాట్లు చేస్తానని నిందితుడు ఫ్రాంకో ములక్కల్ ఆఫర్ ఇచ్చాడు. ఆయన తరపు మధ్యవర్తి తనను కలిసి మాట్లాడినట్టు బాధితురాలి సోదరుడు మీడియాకు తెలిపాడు.

తనను ఎవరూ ఏమీ చేయలేరని, తాను ఏం చెప్పినా బిషప్‌లంతా నమ్ముతారని, కాబట్టి కేసును ఉపసంహరించుకోవడం తప్ప మరో దారి లేదని ఫ్రాంకో చెప్పినట్టు ఆయన తెలిపారు. మరోవైపు, నన్ ఆరోపణలను బిషప్ కొట్టిపడేశారు. ఎవరో కావాలనే ఆమెతో ఇలా మాట్లాడిస్తున్నారని, చర్చి వ్యతిరేకులు నన్‌లను అడ్డం పెట్టుకుని, చర్చి ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ బాధిత సన్యాసిని వాటికన్‌కు లేఖ రాసింది. బిషప్ తనపై 13 సార్లు అత్యాచారం చేసినా ఎందుకు అతడిని నమ్మాల్సి వచ్చిందో, ఎందుకు తాను భయపడుతున్నానో వివరించానని, అయినా, తన మాటలను ఎవరూ విశ్వసించడం లేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. బిషప్‌‌లు, మతాధికారులకు ప్రత్యేకంగా నివాసాలు కేటాయించినప్పుడు వారు రాత్రివేళల్లో కాన్వెంట్లలో ఎందుకు గడుపుతున్నారో చెప్పాలని ప్రశ్నించింది. తనకు జరిగిన నష్టాన్ని చర్చి తిరిగి తెచ్చివ్వగలదా? అని నిలదీస్తూ భారత్‌లోని వాటికన్ ప్రతినిధి గియాంబటిస్టా డికాట్రాకు లేఖ రాసింది.

బాధితురాలి లేఖతో దిగివచ్చిన కేరళ పోలీసులు.. ఈ నెల 19న విచారణకు హాజరుకావాల్సిందిగా ఫ్రాంకో ములక్కల్‌కు సమన్లు పంపారు.   
Thu, Sep 13, 2018, 06:46 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View