గోళ్లు కొరికే అలవాటుతో ఏకంగా చర్మ కేన్సర్ వచ్చేసింది!
Advertisement
గోళ్లు కొరకవద్దనీ, అది అనారోగ్యకరమైన అలవాటు అని పెద్దలు చెబితే పిల్లలు లైట్ గా తీసుకుంటారు. కానీ తాజాగా ఈ అలవాటు కారణంగానే ఓ అమ్మాయికి అత్యంత అరుదైన చర్మ కేన్సర్ సోకింది. అంతేకాదు.. దీని కారణంగా చివరికి ఆమె తన కుడిచేతి బొటనవేలును కోల్పోవలసి వచ్చింది.

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ కు చెందిన కోర్ట్నీ(20) అనే యువతి స్థానికంగా ఉండే ఓ కాలేజీలో చదువుకుంటోంది. అయితే అక్కడ సీనియర్లు, తోటి విద్యార్థులు వేధించడంతో మానసికంగా కుంగిపోయిన ఆమె గోళ్లు కొరకడం ప్రారంభించింది. ఇది చివరికి ఓ వ్యసనంలాగా మారిపోవడంతో చివరికి బొటనవేలుకున్న గోరును పూర్తిగా కొరికేసింది. దీంతో అక్కడ చర్మం నల్లబడటం ప్రారంభించింది. దీన్ని తల్లిదండ్రులు, స్నేహితులకు కనిపించకుండా రంగురంగులున్న ప్లాస్టిక్ గోళ్లతో కవరింగ్ చేసేది.

కానీ ఈ ఇన్ఫెక్షన్ చేతికి వ్యాపించడం మొదలుపెట్టింది. చివరికి ఆమె బ్యూటీషియన్ వద్దకు వెళ్లగా, ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా అక్కడ సూచించారు. దీంతో చేసేదేమీ లేక తల్లిదండ్రులకు యువతి అసలు విషయాన్ని చెప్పింది. కోర్ట్నీకి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అత్యంత అరుదైన చర్మ కేన్సర్ సోకిందని చెప్పడంతో ఆమె దిమ్మతిరిగిపోయింది.

ఈ కేన్సర్ మిగతా శరీరానికి సోకే ప్రమాదముందనీ, కాబట్టి బొటనవేలిని తీసేయాలని వైద్యులు సూచించారు. దీంతో ఆపరేషన్ పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్న కోర్ట్నీ.. సర్జరీకి అంగీకరించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకూ నాలుగుసార్లు ఆమె చేతికి సర్జరీలు చేసిన వైద్యులు.. బొటనవేలిని తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉందనీ, కొన్నిరోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు.
Wed, Sep 12, 2018, 04:13 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View