వివాహితకు సైకో వేధింపులు.. ఆత్మహత్యాయత్నం చేస్తే ఆసుపత్రికి వచ్చిమరీ దాడి!
Advertisement
రంగారెడ్డి జిల్లాలో ఓ సైకో రెచ్చిపోయాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఓ మహిళను వేధించడం మొదలుపెట్టాడు. ఈ బాధ తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలిపై ఆసుపత్రికి వెళ్లి మరీ దాడిచేశాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారానికి చెందిన బాధితురాలు, తన భర్తతో కలసి ఉంటోంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీకి చెందిన సతీశ్(30) ఆమె వెంటపడటం మొదలుపెట్టాడు. గతంలో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోకపోతే భర్తను చంపేస్తానని ఆమెను బెదిరించాడు. ఈ వేధింపులు తట్టుకోలేని  బాధితురాలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కేపీహెచ్ బీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

బాధితురాలు ఆసుపత్రిలో కోలుకుంటుండగా అక్కడికి వచ్చిన సతీశ్.. తనను పెళ్లి చేసుకోవాలని మళ్లీ డిమాండ్ చేశాడు. దీన్ని బాధితురాలు తిరస్కరించడంతో వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సతీశ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సదరు మహిళను వేధించినందుకు సతీశ్ పై గతంలోనే ఓ కేసు నమోదయిందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
Wed, Sep 12, 2018, 03:41 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View