పోలవరం చరిత్రలో మరో మైలురాయి.. గ్యాలరీ వాక్ ను ప్రారంభించిన చంద్రబాబు
Advertisement
ఆంధ్రుల జీవనాడి పోలవరం చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ప్రాజెక్టు స్పిల్ వే అంతర్భాగంలో నిర్మించిన గ్యాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. కుటుంబసభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి గ్యాలరీ వాక్ చేశారు. గ్యాలరీలో నడవడం సంక్లిష్ట ప్రక్రియ కావడంతో వివిధ శాఖల అధికారులు సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు చేశారు. గ్యాలరీలో వైద్య బృందాలు, ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తరలించేందుకు బయట అంబులెన్సులను సిద్ధం చేశారు.

దాదాపు 2 వేల మంది పోలీసు సిబ్బందితో ఈ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా వైపు ఉన్న అడవుల్లో గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కు చెందిన వెయ్యి మంది కూంబింగ్ నిర్వహించారు. పోలవరం పరిసర ప్రాంతాలన్నింటినీ నిన్ననే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి బందోబస్తును 11 సెక్టార్లుగా విభజించారు.

గ్యాలరీ ప్రారంభానికి ముందు తన కుటుంబసభ్యులతో కలసి చంద్రబాబు అమరావతి నుంచి పోలవరంకు హెలికాప్టర్ లో చేరుకున్నారు. గ్యాలరీ ప్రారంభం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. 
Wed, Sep 12, 2018, 11:47 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View