ఆ రెండు పార్టీలు కలిస్తే.. మాకే లాభం: హరీష్ రావు
Advertisement
తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ పొత్తును తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ కలయిక కేవలం అధికార దాహం మాత్రమేనని చెప్పారు. తెలంగాణలో టీడీపీ ఉనికే లేదని... ఈ రెండు పార్టీలు కలిస్తే టీఆర్ఎస్ కే లాభమని చెప్పారు. ఇలాంటి అపవిత్ర పొత్తులను ప్రజలు హర్షించరని అన్నారు. ఏ సిద్ధాంతం కింద ఈ పార్టీలు కలుస్తున్నాయని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కూటములు పెట్టుకున్నా, కేసీఆర్ విజయాన్ని ఆపలేరని చెప్పారు.

400 ఏళ్ల హైదరాబాద్ చరిత్రలో, 70 ఏళ్ల కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో జరగని అభివృద్ధిని ఈ నాలుగేళ్ల కాలంలో కేసీఆర్ చేసి, చూపించారని హరీష్ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు యత్నించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. ఈ పార్టీల పొత్తు వెనుక రాష్ట్ర ప్రయోజనాలు లేవని, రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని చివరి వరకు చంద్రబాబు అడ్డుకున్నారని, తెలంగాణ పోలీసు శాఖను కూడా కేంద్ర ప్రభుత్వ చేతుల్లో పెట్టాలని యత్నించారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక కేసీఆర్ చూసుకుంటారని, ఆయన నిర్ణయాన్ని అమలు చేయడమే తమ కర్తవ్యమని చెప్పారు. 
Wed, Sep 12, 2018, 11:00 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View