జగ్గారెడ్డికి బెయిలు తిరస్కరణ.. చంచల్‌గూడకు తరలింపు!
Advertisement
మనుషుల అక్రమ రవాణా కేసులో ఆరెస్ట్ అయిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి (తూర్పు జయప్రకాశ్ రెడ్డి) పెట్టుకున్న బెయిలు పిటిషన్ తిరస్కరణకు గురైంది. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన సికింద్రాబాద్ కోర్టు బెయిలును తిరస్కరించి 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకుముందు జగ్గారెడ్డిని పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బెయిలు పిటిషన్ తిరస్కరణకు గురవడంతో జగ్గారెడ్డిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలులో ఆయనకు 6403 నంబరు కేటాయించారు.  

తన భార్యాపిల్లల పేరుతో గుజరాత్‌కు చెందిన ముగ్గురిని అమెరికాకు తరలించేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.15 లక్షలు తీసుకున్నట్టు జగ్గారెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్టు ఉత్తర మండలం డీసీపీ బి.సుమతి విలేకరులకు తెలిపారు. అమెరికాకు తీసుకెళ్లిన ముగ్గురిని ఎక్కడ వదిలిపెట్టారో తెలుసుకునేందుకు జగ్గారెడ్డిని మరోమారు కస్టడీలోకి తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. అలాగే, ట్రావెల్ ఏజెంట్ మధుసూదన్, జగ్గారెడ్డి అనుచరుడు జట్టి కుసుమకుమార్‌లను విచారించనున్నట్టు సుమతి తెలిపారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ తనను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. తాను ఎటువంటి నేరం చేయలేదని స్పష్టం చేశారు.
Wed, Sep 12, 2018, 08:52 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View