అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు మోదీ శుభవార్త!
Advertisement
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లకు ప్రధాని నరేంద్రమోదీ శుభవార్త చెప్పారు. అక్టోబరు నెల నుంచి వారి గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్టు ప్రకటించారు. దీంతోపాటు ఆశా వర్కర్లకు ఉచితంగా ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన లబ్ధి చేకూరుస్తామని పేర్కొన్నారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆశా, ఏఎన్ఎం, అంగన్‌వాడీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా అందరికీ దీపావళి కానుక అందిస్తున్నట్టు చెప్పారు.

రూ.3 వేలుగా ఉన్న గౌరవ వేతనాన్ని రూ.4,500, రూ.2,200 ఉన్న వేతనాన్ని రూ.3,500కి పెంచుతున్నట్టు చెప్పారు. అంగన్‌వాడీ హెల్పర్ల పారితోషికాన్ని రూ.1500 నుంచి రూ.2,500కు పెంచుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే, ఐసీడీఎస్-సీఏఎస్ సాఫ్ట్‌వేర్‌పై పనిచేయడం తెలిసిన వారికి అదనంగా రూ.250 నుంచి రూ.500 వరకు ప్రోత్సాహకాలు చెల్లిస్తామన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ గర్భిణులు, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణలో అంగన్‌‌వాడీలు, ఆశాకార్యకర్తల పనితీరును ప్రశంసించారు.

జీతాల పెంపుపై ఆల్ ఇండియా అంగన్‌వాడీ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేస్తూనే, కంటి తుడుపు చర్యేనని అభిప్రాయపడింది. కనీసం రూ.18 వేలు చేయాలని, పెన్షన్‌తోపాటు సామాజిక రక్షణ కూడా కావాలని డిమాండ్ చేసింది.
Wed, Sep 12, 2018, 07:44 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View