ఒకే మేనిఫెస్టో రూపొందించేలా చర్చలు జరిపాం: టీ టీడీపీ అధ్యక్షుడు రమణ
Advertisement
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షపార్టీలు వ్యూహరచన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పొత్తుల అంశంపై టీ టీడీపీ- టీ కాంగ్రెస్, టీ కాంగ్రెస్- సీపీఐ నేతలు ఇటీవల భేటీ అయ్యారు. తాజాగా, టీ కాంగ్రెస్- టీ టీడీపీ-  సీపీఐ తెలంగాణ నేతలు పార్క్ హయత్ లో ఈ రోజు నిర్వహించిన సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీపీఐ తెలంగాణ  రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మూడు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు సమాచారం. త్వరలోనే మళ్లీ ఓసారి సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ, మహాకూటమిగా ముందుకెళ్లాలని నిర్ణయించామని, అన్ని పార్టీలు కలిసి ఒకే మేనిఫెస్టో రూపొందించేలా చర్చలు జరిపామని అన్నారు. ప్రజలు కేసీఆర్ కు అధికారం అప్పగిస్తే అన్ని వర్గాలను నిరాశపరిచాడని విమర్శించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పొత్తులపై ఇది ప్రాథమిక స్థాయి చర్చలేనని, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలను కలుపుకొని పోతామని చెప్పారు. మహాకూటమి ద్వారా కేసీఆర్ ను గద్దెదించడం సాధ్యమని అభిప్రాయపడ్డారు.

చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ నియంతృత్వ ధోరణి పెరిగిందని, ఆయన పాలన నిజాం నవాబ్ ను తలపిస్తోందని మండిపడ్డారు. తమ లక్ష్యం కేసీఆర్ ను గద్దె దించడమేనని మరోసారి స్పష్టం చేశారు. కాగా, త్వరలోనే ఓ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది.  
Tue, Sep 11, 2018, 04:54 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View