హీరోయిన్ స్వరభాస్కర్ ను దూషించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. తిక్క కుదిర్చిన ట్విట్టర్!
Advertisement
Advertisement
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి ప్రముఖ మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ షాకిచ్చింది. హీరోయిన్ స్వరభాస్కర్ చేసిన ట్వీట్ పై  చేసిన అసభ్యకరమైన కామెంట్ ను తొలగించాలని ఆదేశించింది. దీంతో వెనక్కి తగ్గిన వివేక్ లెంపలేసుకుని సదరు అభ్యంతరకరమైన ట్వీట్ ను తొలగించారు.

జలంధర్ చర్చికి చెందిన బిషప్ ఒకరు తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని కేరళకు చెందిన ఓ సన్యాసిని ఇటీవల పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ ఎమ్మెల్యే జార్జ్  ‘ఇన్ని రోజులు ఎంజాయ్ చేసి ఇప్పుడు రేప్ అంటావా? తొలుత ఎందుకు ఫిర్యాదు చేయలేదు?’ అంటూ ఆ సన్యాసినిపై మండిపడ్డారు.

దీనిపై బాలీవుడ్ హీరోయిన్ స్వరభాస్కర్ తీవ్రంగా స్పందించారు. ‘ఎమ్మెల్యే అలా వ్యాఖ్యానించడం నిజంగా సిగ్గుచేటు. ఆయన మాటలు రోత పుట్టించేలా ఉన్నాయి. ఇలాంటి చెత్తే ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూ దేశాన్ని మతం పేరిట విడగొడుతోంది. నిజంగా అతని వ్యాఖ్యలు అసహ్యం కలిగిస్తున్నాయి’ అని ట్వీట్ చేసింది.

అలాగే, ఇటీవల వరవరరావు, సుధా భరద్వాజ్ సహా పలువురు హక్కుల కార్యకర్తలను మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అరెస్టులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ‘మీ టూ అర్బన్ నక్సల్’ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడిచింది. దీనికి స్వరభాస్కర్ సైతం మద్దతు తెలిపింది.

ఈ నేపథ్యంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్వరభాస్కర్ చేసిన ట్వీట్ పై స్పందిస్తూ..‘‘మీ టూ ప్రాస్టిట్యూట్ నన్’ అని ప్లకార్డులు పట్టుకుని ఇంకా ఎవరూ రాలేదే?’’ అంటూ అసభ్యకరమైన కామెంట్ చేశారు. దీంతో వివేక్ వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించింది. అత్యాచార బాధితుల బాధను తనకు నచ్చని వాళ్లపై దాడిచేసే ఆయుధంగా వివేక్ వాడుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కామెంట్లపై స్వరభాస్కర్ ట్విట్టర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.

దీన్ని పరిశీలించిన ట్విట్టర్ యాజమాన్యం వెంటనే దాన్ని తొలగించాలని వివేక్ అగ్నిహోత్రికి సందేశం పంపింది. ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు తమ పాలసీకి విరుద్ధమని స్పష్టం చేసింది. దీంతో వెంటనే తేరుకున్న వివేక్ అసభ్య కామెంట్ ను డిలీట్ చేసి సైలెంట్ అయిపోయాడు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న ట్విట్టర్ యాజమాన్యానికి స్వరభాస్కర్ కృతజ్ఞతలు తెలిపింది.
Tue, Sep 11, 2018, 03:53 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View