తప్పుడు నంబర్ ఇచ్చి కవ్వించిన యువతి.. ఆమె కోసం 246 మంది మహిళలకు ఈ-మెయిల్స్ పెట్టిన యువకుడు!
Advertisement
ఓ అమ్మాయిని తొలిచూపులోనే ఇష్టపడ్డ యువకుడు ఆమె రాంగ్ నంబర్ ఇవ్వడంతో దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాడు. కాలేజీలో ఆమె పేరుతో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఈ-మెయిల్ పెట్టి చిన్నస్థాయి కలకలం సృష్టించాడు. చివరికి ఈ విషయం సదరు యువతికి తెలియడంతో అతడితో డేట్ కు వెళ్లేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీలో ఉన్న క్యాంపస్ బార్ లో శుక్రవారం పార్టీ సందర్భంగా కార్లోస్ జెంతానా అనే యువకుడు నికోల్ అనే డచ్ యువతిని కలుసుకున్నాడు. ఆమెను చూడగానే ప్రేమలో పడిపోయాడు. నికోల్ కూర్చున్న టేబుల్ దగ్గరకు వెళ్లి మాటలు కలిపాడు. ఈ సందర్భంగా ఒకరి నంబర్లు మరొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. అయితే నికోల్ అతనికి ఉద్దేశపూర్వకంగానో లేదా పొరపాటుగానో తప్పుడు నంబర్ ఫోన్ లో ఎంటర్ చేసి ఇచ్చింది.

కార్లోస్ ఆమెకు కాల్ చేసేందుకు ప్రయత్నించగా కనెక్ట్ కాలేదు. దీంతో ఆమెను ఎలాగైనా కలవాలని అనుకున్న కార్లోస్ యూనివర్సిటీ డిక్షనరీలోకి వెళ్లాడు. అక్కడ నికోల్ పేరుతో ఉన్న ఈ-మెయిల్స్ అడ్రసులను అన్నింటినీ సెలక్ట్ చేసి ‘నిన్న రాత్రి నేను నిన్ను కలుసుకున్నాను. కానీ నువ్వు రాంగ్ నంబర్ ఇచ్చావ్’ అంటూ ఈ-మెయిల్ పెట్టాడు. ఇలా క్యాంపస్ లో ఉన్న 246 మంది ‘నికోల్’ లకు ఈ సందేశం చేరిపోయింది. ఇలా ఈ-మెయిల్స్ అందుకున్నవారిలో అమ్మాయిలు, వర్సిటీ సిబ్బంది మాత్రమే కాకుండా ఏకంగా మహిళా ప్రొఫెసర్లు కూడా ఉన్నారు.


తెల్లవారి లేవగానే ఫోన్లు చూసుకున్న చాలామంది నికోల్ లు అదిరిపడ్డారు. కొన్ని గంటల్లోనే ఈ విషయం వర్సిటీ క్యాంపస్ అంతా దావానలంలా వ్యాపించింది. చివరికి ఈ విషయాన్ని ఓ స్నేహితురాలు అసలు నికోల్ కు చెప్పడంతో ఆమె కార్లోస్ నంబర్ కు కాల్ చేసింది. పనిలో పనిగా, వర్సిటీలో తన పేరుతో ఇంతమంది ఉండటంతో చాలామందిని కలిసింది. వీరిలో 25 మంది నికోల్ లు కలసి ఓ గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఫేస్ బుక్ పేజీని ఏర్పాటు చేసుకుని కలుసుకున్న వీరంతా అసలు నికోల్ కు కృతజ్ఞతలు తెలిపారు.

అయితే 246 మందికి ఈ-మెయిల్స్ పంపి కలకలం రేపిన కార్లోస్ కష్టం ఊరికే పోలేదు. అతనితో డేట్ కు వెళ్లేందుకు అసలైన నికోల్ అంగీకరించింది. అంతేకాదండోయ్.. క్యాంపస్ లో తామందరినీ కలిపిన కార్లోస్-నికోల్ కు మాంచి పార్టీ ఇచ్చేందుకు 25 మంది నికోల్ లు సిద్ధమయ్యారు.
Tue, Sep 11, 2018, 03:16 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View