అమ్మ కాదు, రాక్షసి.. ప్రియుడి మోజులో పడి చిన్నారి చేయి విరగ్గొట్టిన తల్లి!
Advertisement
హైదరాబాద్ లో ఓ మహిళ కన్నతల్లి అన్న పదానికి అర్థం మార్చేసింది. ప్రియుడి మోజులో పడి నాలుగేళ్ల కన్నకూతురిని చిత్రహింసలు పెట్టింది. అక్కడితో ఆగకుండా ఆ ప్రియుడి చేత ఈ పసి ప్రాణానికి నరకం చూపించింది. చివరికి పాపం పండటంతో అధికారులు ఆ కసాయి తల్లిని కటకటాల వెనక్కు నెట్టారు.

నల్గొండ జిల్లా ముకునూరు గ్రామానికి చెందిన సరితకు ఆరేళ్ల క్రితం వెంకన్నతో పెళ్లయింది. వీరికి రేణుక(4) అనే పాప ఉంది. ఏడాదిన్నర క్రితం భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో కుమార్తెను తీసుకుని సరిత ఇక్కడి ముసారాంబాగ్‌లోని ఈస్ట్‌ ప్రశాంత్‌నగర్‌లో ఉంటోంది. ఈ నేపథ్యంలో 9 నెలల క్రితం ఆమెకు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న వెంకట్‌రెడ్డి (35)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఈ అక్రమ సంబంధానికి రేణుక అడ్డుగా ఉందని భావించిన సరిత.. చిన్నారిని చిత్రహింసలు పెట్టడం ప్రారంభించింది. ప్రియుడు వెంకట్ రెడ్డి కూడా ఈ పాపను కొరికి శాడిజం చూపేవాడు. అమ్మ తప్ప ఇంకొకరు తెలియని వయసులో ఏడుస్తూనే చిన్నారి ఈ బాధలన్నింటినీ భరించింది.

ఈ క్రమంలోనే సరిత, వెంకటరెడ్డి నిన్న తీవ్రంగా దాడిచేయడంతో చిన్నారి రేణుక ఎడమ చేయి విరిగిపోయింది. ఈ నొప్పి తట్టుకోలేని బాలిక గట్టిగా ఏడుస్తుండటంతో స్థానికులు ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి తెలిపారు. దీంతో ఆయన బాలల హక్కుల సంఘం నేత అచ్యుతరావు సాయంతో బాలికను కాపాడి రెస్క్యూ హోమ్ కు తరలించారు. వీరిచ్చిన సమాచారంతో కసాయి తల్లి సరితను మలక్ పేట పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రియుడు వెంకట్ రెడ్డి ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు ప్రారంభించారు.
Tue, Sep 11, 2018, 01:47 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View