వివాహేతర సంబంధం.. భార్య తలను నరికి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన భర్త!
Advertisement
భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేకపోయిన ఓ భర్త రెచ్చిపోయాడు. ఆమె తలను మొండెం నుంచి వేరు చేసి పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని అజ్జంపుర ప్రాంతంలో సతీశ్, రూప దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ 9 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గతంలో డ్రైవర్ గా పనిచేసిన సతీశ్ ఇటీవల అజ్జంపురలోని శివణిలో చికెన్ షాప్ తెరిచాడు. ఈ నేపథ్యంలో రూపకు(28) ఇదే ప్రాంతానికి చెందిన సునీల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు భర్త సతీశ్ హెచ్చరించినా రూప ప్రవర్తనలో మార్పు రాలేదు. కుటుంబ సభ్యులు, పెద్దలు రాజీ కుదర్చినా ప్రయోజనం లేకపోయింది.

ఈ నేపథ్యంలో సోమవారం పనిమీద షాపు నుంచి తొందరగా ఇంటికొచ్చిన సతీశ్.. భార్య రూప, సునీల్ సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయాడు. పక్కన ఉన్న కొడవలి తీసుకుని సునీల్ పై విసిరాడు. అతను దాని నుంచి తప్పించుకుని పారిపోవడంతో సతీశ్ కోపం నషాళానికి అంటింది. దీంతో అదే కొడవలితో భార్య రూపపై విచక్షణారహితంగా దాడిచేశాడు. చివరికి ఆమె తలను మొండెం నుంచి వేరు చేశాడు. అనంతరం ఆ తలను బ్యాగులో పెట్టి, బైక్ పై 20 కి.మీ వెళ్లి అజ్జంపుర పోలీస్ స్టేషన్ లో అప్పగించి, లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tue, Sep 11, 2018, 01:07 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View