హైదరాబాదులో 10 సీట్లు అడుగుతున్న టీడీపీ.. కాంగ్రెస్ నేతల్లో గుబులు!
Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు పొత్తుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినప్పటికీ... సీట్ల పంపకాలకు సంబంధించి చర్చలు కూడా మొదలయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో టీడీపీకి మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, నగరంలో తమకు 10 స్థానాలను కేటాయించాలని టీడీపీ కోరుతోంది. 2014 ఎన్నికల్లో కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో టీడీపీ జయకేతనం ఎగురవేసింది. అయితే ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో, తమకు కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, ఉప్పల్, మలక్ పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్ పేట నియోజకవర్గాలను కేటాయించాలని కాంగ్రెస్ ను టీడీపీ కోరుతోంది. దీంతో, ఈ 10 నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. టీడీపీ అడుగుతున్న స్థానాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ ప్రముఖులు కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత  ఎన్నికల్లో నగరంలో ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ గెలుపొందలేకపోయింది. 3 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. టీడీపీ 9, ఎంఐఎం 7, బీజేపీ 5, టీఆర్ఎస్ 3 స్థానాల్లో విజయం సాధించాయి. 
Tue, Sep 11, 2018, 12:32 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View