జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలోకి జారిపోయిన బస్సు.. 20 మందికి పైగా మృతి!
Advertisement
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇక్కడి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కన ఉన్న లోయలోకి జారిపోయింది. ఈ ఘటనలో 20 మందికి పైగా చనిపోగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన భక్తులు, కొందరు స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అధికారులకు సమాచారం అందించారు.

బస్సు లోతుగా ఉన్న ప్రాంతంలోకి పల్టీలు కొట్టడంతో తుక్కుతుక్కయింది. దీంతో బస్సులో చాలామంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి జగిత్యాలకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులు చనిపోవడంతో పలువురు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే జగిత్యాల కలెక్టర్, ఎస్పీలు ఘటనాస్థలానికి చేరుకుంటున్నారు. ఈ రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి ఈటల రాజేందర్.. క్షతగాత్రులకు చికిత్స అందించాలని జిల్లాలోని అన్ని ఆసుపత్రులను ఆదేశించినట్లు తెలిపారు. అవసరమైతే బాధితులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తామని తెలిపారు.
Tue, Sep 11, 2018, 12:20 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View