అప్పుడు 8 శాతం వడ్డీకి నో చెప్పిన బాబు, ఇప్పుడు 10 శాతం వడ్డీకి రూ.2,000 కోట్ల అప్పు తెచ్చారు!: ఉండవల్లి ఫైర్
Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 శాతం కంటే తక్కువ వడ్డీకే రుణాలు తీసుకోవాలని కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ(సీఆర్డీఏ)ని ఆదేశించిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు జీవో జారీచేసిందని వెల్లడించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో రుణం ఇవ్వడానికి ముందుకొచ్చినా 8 శాతం కంటే తక్కువ వడ్డీకే గ్యారెంటీ ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం మెలిక పెట్టిందని ఉండవల్లి విమర్శించారు. అదే ప్రభుత్వం గత నెలలో 10.32 శాతం వడ్డీ రేటుతో రూ.2,000 కోట్ల రుణం సమీకరణకు అమరావతి బాండ్లను జారీచేసేందుకు అనుమతి ఇచ్చిందని ఉండవల్లి అన్నారు. ఈరోజు రాజమండ్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తక్కువ వడ్డీకే రుణాలు తీసుకోవాలంటూ జీవోలు జారీచేసిన చంద్రబాబు ప్రభుత్వం గత నాలుగేళ్లలో ఐదు సార్లు 8 శాతం కంటే ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చుకుందని ఉండవల్లి తెలిపారు. మరి దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని వెల్లడించారు. గుజరాత్ పవర్ కార్పొరేషన్, గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్లు ఇదే తరహాలో అప్పులు తెచ్చుకున్నారని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చెప్పడంపై ఉండవల్లి మండిపడ్డారు. అవి కంపెనీలనీ, వాటి లక్ష్యం వ్యాపారాలు చేసి లాభం గడించడమేనని తెలిపారు. కానీ సీఆర్డీఏ కంపెనీ కాదనీ, ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజధానిని జనం కోసం కడుతున్నారా? రియల్ ఎస్టేట్ కోసం కడుతున్నారా?  అని ప్రశ్నించారు.
Tue, Sep 11, 2018, 11:48 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View