కన్నబిడ్డనే అమ్మేశాడు.. వ్యసనాలకు బానిసైన ఓ తండ్రి దారుణం!
Advertisement
వ్యసనాలకు బానిసైన ఓ తండ్రి రెండు నెలల వయసున్న కన్నబిడ్డనే  25 వేల రూపాయలకు అమ్మేశాడు. భార్య ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి రావడంతో బంధువులకు పెంపకానికి ఇచ్చినట్లు బుకాయిస్తున్నాడు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గాండ్లగూడెంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం గ్రామానికి చెందిన భూక్యా దుర్గారావు, ఝాన్సీ దంపతులు. ఇద్దరిదీ రెండో వివాహమే. దుర్గారావుకు మొదటి భార్య వల్ల ఇద్దరు పిల్లలుండగా, ఝాన్సీకి తొలి భర్తతో ఓ కొడుకు పుట్టాడు. కాగా, రెండు నెలల క్రితం ఝాన్సీ ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.

వ్యసనాలకు బానిసైన దుర్గారావు శుక్రవారం అశ్వారావుపేట వెళ్లివద్దామని భార్యను నమ్మించి ఆటోలో తీసుకువెళ్లాడు. మార్గ మధ్యంలో వాగొడ్డు సమీపాన చింతపూడి మండలం రేజర్ల గ్రామానికి చెందిన వ్యక్తుల నుంచి రూ.25 వేలు తీసుకుని మగ బిడ్డను వారికి అమ్మేశాడు. తనకు ఐదువందలిచ్చి తూర్పు గోదావరి జిల్లా చీపురుగూడెంలోని పుట్టింటికి పంపాడని, తన కుటుంబ సభ్యులు బిడ్డకోసం నిలదీయడంతో విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అయితే భార్య అనుమతితోనే తాను బంధువులకు బిడ్డను పెంపకానికి ఇచ్చానని దుర్గారావు చెబుతున్నాడు. దీనిపై అశ్వారావుపేట ఏఎస్‌ఐ సుబ్బారావు మాట్లాడుతూ ఫిర్యాదు అందిందని, బిడ్డను స్వాధీనం చేసుకునేందుకు సిబ్బందిని చింతలపూడికి పంపినట్లు తెలిపారు.
Tue, Sep 11, 2018, 11:16 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View