నీళ్లు పట్టుకునే ఏటీఎంలు వస్తున్నాయి!
Advertisement
ఏటీఎం అనగానే కార్డు పెట్టి మన బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బు తీసుకునే మెషిన్‌గానే ఇప్పటి వరకు మనకు తెలుసు. త్వరలో కార్డు పెట్టి మంచినీటిని పట్టుకునే ఏటీఎంలు కూడా వస్తున్నాయి. నిజమా...అని ఆశ్చర్యపోకండి.. ఇది నిజమే! కేజీ బేసిన్‌లో తీవ్ర మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న తీరప్రాంత గ్రామ నివాసితుల కోసం ఓఎన్‌జీసీ అమలు చేస్తున్న వినూత్న పథకం ఇది. బేసిన్‌ పరిధిలోని 13 గ్రామాల్లో గ్రామానికి ఒకటి చొప్పున మొత్తం 13 ఏటీఎంలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి ‘ఓఎన్‌జీసీ స్వచ్ఛ జలధార‘ అని నామకరణం చేసింది.

‘ఒక్కొక్కటీ 20 లక్షల ఖరీదు చేసే ఏటీఎం మిషన్లు ఇప్పటికే ఆయా గ్రామాలకు చేరాయి. భూగర్భ జలాల నుంచి కనెక్షన్‌ ఇవ్వడమే ఆలస్యం. కార్డులు జారీచేసి నెలాఖరు నుంచి నీళ్లందించే ప్రక్రియ ప్రారంభిస్తాం. వీటి పనితీరు ఆధారంగా మరిన్ని గ్రామాలకు విస్తరిస్తాం’ అని సంస్థ ఈడీ డి.ఆర్‌.ఎం.శేఖర్‌ తెలిపారు.

తీరంలోని అంతర్వేది, కేశవదాసుపాలెం, అంతర్వేదికర, కేశనపల్లి, బియ్యపుతిప్ప, లిఖితపూడి,బాడవ, నాగాయలంక, పల్లం, చిర్రయానాం, గోపవరం గ్రామ వాసులు ఈ  ఏటీఎంల ద్వారా నీరందుకోనున్నారు. ఒక్కో గ్రామంలో 3 వేల కుటుంబాలకు ఏటీఎం కార్డులు అందిస్తారు. రోజుకి ఒకసారి 20 లీటర్ల నీరు ఈ కార్డు వినియోగించి పట్టుకోవచ్చు. ఓఎన్‌జీసీ కార్యకలాపాలు చేపట్టక ముందు నుంచి ఉప్పునీటితో సతమతమవుతున్న తీరప్రాంత వాసులకు ఈ సదుపాయం వరం అని చెప్పొచ్చు. చెన్నైకి చెందిన సర్వో కనెక్ట్‌ సంస్థ ఈ ఏటీఎంలను అభివృద్ధి చేసింది.
Tue, Sep 11, 2018, 10:16 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View