పార్టీ మారడం లేదన్న జార్ఖిహొళి బ్రదర్స్.. ఊపిరి పీల్చుకున్న కుమారస్వామి!
Advertisement
కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఖండిస్తూ ప్రకటన చేసి, జార్ఖిహొళి సోదరులు ఊహాగానాలకు తెరదించారు. ఇటీవల జరిగిన పీఎల్‌డీ ఎన్నికల్లో పరాజయం పాలైతే సంచలన నిర్ణయం తీసుకుంటామంటూ జార్ఖిహొళి సోదరులు ప్రకటించి కలకలం రేపారు. ఈ ఎన్నికల్లో కర్ణాటక కాంగ్రెస్ మహిళా చీఫ్ లక్ష్మీ హెబ్బాళ్కర్ వర్గమే బ్యాంకు పథాధికారులుగా ఎన్నికవడంతో జార్ఖిహొళి సోదరులు కాంగ్రెస్ వీడడం ఖాయమని అందరూ భావించారు. అయితే, తాము కాంగ్రెస్‌ను వీడేది లేదని తాజాగా వారు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

తమతో సహా మరో పదిమంది ఎమ్మెల్యేలను తీసుకుని జార్ఖిహోళి సోదరులు బీజేపీలో చేరబోతున్నట్టు సోమవారం వార్తలు షికారు కొట్టాయి. ఇందుకు ప్రతిగా తనను ఏడాదిపాటు సీఎంను చేయాలన్న డిమాండ్‌ను కూడా సతీశ్ జార్ఖిహొలి బీజేపీ ముందు ఉంచినట్టు వార్తలొచ్చాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా రమేశ్ జార్ఖిహొళి సోమవారం బీజేపీ నేతలు శ్రీరాములు, రేణుకాచార్యలతో భేటీ అయ్యారు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

అయితే, అనూహ్యంగా సాయంత్రానికి వారి నుంచి ఓ ప్రకటన వెలువడింది. తాము కాంగ్రెస్‌ను వీడడం లేదన్నదే దాని సారాంశం. పార్టీ పట్ల తన సోదరుడు సతీశ్ అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమేనని, పార్టీలో నాలుగేళ్లుగా అతడికి తీవ్ర అన్యాయం జరుగుతోందని రమేశ్ అందులో పేర్కొన్నారు. పీఎల్‌డీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు కొంత చిరాకు కలిగించాయన్నారు.

అయితే, అంతమాత్రాన పార్టీని వీడాలనుకోవడం లేదన్నారు. ఐదేళ్లయినా, పదేళ్లయినా సతీష్‌ను ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని రమేశ్ జార్ఖిహొళి వివరించారు. నిజానికి జార్ఖిహొళి సోదరులు పార్టీ వీడితే ప్రభుత్వం ప్రమాదంలో పడేదే. అయితే.. వారు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో కుమారస్వామి ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన చిక్కేమీ లేనట్టే.
Tue, Sep 11, 2018, 09:54 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View