పెట్రోలు ధరలపై కాంగ్రెస్‌ను ఇరికించబోయి బొక్కబోర్లా పడిన బీజేపీ.. పడీపడీ నవ్వుకుంటున్న నెటిజన్లు!
Advertisement
పెరుగుతున్న పెట్రోలు ధరలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాలు భారత్ బంద్‌ కూడా పాటించాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన బీజేపీ పెట్రోలు ధరలపై కాంగ్రెస్‌ను ఇరికించాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘పెట్రోలియం ధరల పెరుగుదలపై వాస్తవం ఇదీ' అంటూ ఓ ఫొటో పోస్టు చేసి అభాసుపాలైంది. భారీగా పెరిగిన పెట్రోలు ధర సూచీని తగ్గించి.. తక్కువ ఉన్న ధరల సూచీని ఎక్కువ చేసి చూపించింది.

పెట్రో ధరల పెంపునకు నిరసనగా విపక్షాలు చేపట్టిన బంద్‌ను నిరసిస్తూ బీజేపీ తన ట్విట్టర్ ఖాతాలో రెండు గ్రాఫ్‌లు పోస్టు చేసింది. వాటిలో ఢిల్లీలో మే 2014లో లీటరు పెట్రోలు ధరను రూ. 71.41గా చూపించింది. కానీ ఇప్పుడు మాత్రం రూ.80.73గా ఉన్నట్టు చూపించింది. అక్కడి వరకు బాగానే ఉంది కానీ, రూ.80తో పోలిస్తే రూ.70 చాలా ఎక్కువని అర్థం వచ్చేలా రూ. 71.41 సూచీని బాగా పెంచేసి, రూ.80.73 సంకేతాన్ని బాగా తగ్గించి చూపించింది. రూ.80.73 కంటే 71 రూపాయలే ఎక్కువ అని చెబుతూ బీజేపీ చేసిన పోస్టును చూసిన నెటిజన్లు పడీపడీ నవ్వుకుంటున్నారు. అంకెలు రానివాళ్లు దేశాన్ని పాలిస్తున్నారంటూ ఎగతాళి చేస్తున్నారు. కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలని ప్రయత్నించి బీజేపీనే ఇరుకున పడిందని సెటైర్లు వేస్తున్నారు.
Tue, Sep 11, 2018, 08:44 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View