అర్ధరాత్రి కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్!
Advertisement
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (తూర్పు జయప్రకాశ్ రెడ్డి)ని సోమవారం రాత్రి పటాన్‌చెరులో పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యా పిల్లల పేరుతో ఇతరులను అమెరికా తీసుకెళ్లి, అక్కడే వదిలి వచ్చారన్న అభియోగాల నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పటాన్‌చెరు రాగా, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు.

ఆయనపై నమోదైన కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. జగ్గారెడ్డి 14 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లేందుకు తనతో సహా భార్య, ఇద్దరు పిల్లల పేర్లతో మొత్తం నలుగురికి పాస్‌పోర్టులు, వీసాలు తీసుకున్నారు. అయితే, తిరుగు ప్రయాణంలో అమెరికా నుంచి ఆయన ఒక్కరే వచ్చారంటూ ఓ వ్యక్తి సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అతడి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. జగ్గారెడ్డి అమెరికాకు తన భార్య, పిల్లలను కాకుండా గుజరాత్‌కు చెందిన యువతి, ఆమె ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి వదిలి వచ్చినట్టు గుర్తించారు. దీంతో మనుషుల అక్రమ రవాణా కింద జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు. జగ్గారెడ్డి అమెరికాకు ఎవరిని తీసుకెళ్లారు? ఎందుకు అక్కడ వదిలి వచ్చారు? అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tue, Sep 11, 2018, 06:29 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View