ప్రాణం కోల్పోయిన రెండేళ్ల చిన్నారి.. రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన బీజేపీ!
Advertisement
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో విపక్షాలు చేపట్టిన భారత్ బంద్ పలుచోట్ల ఉద్రిక్తంగా కొనసాగింది. బంద్ నేపథ్యంలో బీహార్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. జెహానాబాద్ లో బంద్ కారణంగా ఓ రెండేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆ చిన్నారిని తీసుకుని ఆమె తల్లిదండ్రులు జెహానాబాద్ సివిల్ ఆసుపత్రికి ఆటోలో బయల్దేరారు. అయితే, బంద్ కారణంగా వాహనాలు వెళ్లకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో, సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో... ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తాము ప్రయాణిస్తున్న ఆటోను వదిలేసి ఉంటే తమ బిడ్డ ప్రాణాలు మిగిలేవని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ఈ ఘటనపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. 'నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ, రెండేళ్ల చిన్నారి రోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయింది. రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలి' అని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ అలోక్ రంజన్ ఘోష్ స్పందిస్తూ, చిన్నారిని తీసుకొస్తున్న వాహనాన్ని ఎవరూ ఆపలేదని చెప్పారు. వారు ఇంటి నుంచే ఆలస్యంగా బయల్దేరి ఉండవచ్చని తెలిపారు. అంబులెన్స్ లను కానీ, ఆసుపత్రికి వస్తున్న వాహనాలను కానీ నిరసనకారులు ఎవరూ ఆపలేదని చెప్పారు. 
Mon, Sep 10, 2018, 03:55 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View