ప్రియుడి ఫోన్ కాల్ తో కూలిన కాపురం.. యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగిన యువతి!
Advertisement
ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు ఆమె భర్తకే చెప్పిన ప్రబుద్ధుడు, తీరా భర్త ఆమెను వదిలేశాక తనకు సంబంధం లేదని చేతులు దులుపుకున్నాడు. అంతటితో ఆగకుండా తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన యువతిపై న్యూసెన్స్ కేసు పెట్టాడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలోని ఐనవోలులో చోటుచేసుకుంది.

ఐనవోలు లోని కొండపర్తి గ్రామానికి చెందిన యువతికి కట్కూరి నరేశ్ అనే యువకుడితో ఏడాది క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ యువతికి గతంలోనే వివాహమై విడాకులు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆమెకు మరో సంబంధం చూసి పెళ్లి చేశారు. ఈ సమయంలో తన ప్రేమ విషయాన్ని యువతి కుటుంబ సభ్యులకు చెప్పలేదు. పెళ్లయిన తర్వాత కూడా నరేశ్ తో ఆమె  ఫోన్ లో మాట్లాడేది. ఈ నేపథ్యంలో వివాహమైన 5వ రోజూ నరేశ్ ఫోన్ చేయగా, భర్త ఫోన్ ఎత్తాడు. ‘నేను నీ భార్యను ప్రేమిస్తున్నా. నువ్వు వదిలేయ్’ అంటూ చెప్పాడు. దీంతో ఇరు కుటుంబాలతో పంచాయితీ పెట్టించిన అతను అమ్మాయిని పుట్టింటికి పంపేశాడు.

తనను భర్త వదిలేసిన విషయాన్ని నరేశ్ కు ఆమె చెప్పగా అతను పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ నరేశ్ ఇంటిముందు ఆందోళనకు దిగింది. తన కాపురాన్ని నరేశ్ నాశనం చేశాడనీ, కాబట్టి అతనే తనకు న్యాయం చేయాలని చెప్పింది. తన తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని నరేశ్ గతంలో హామీ ఇచ్చాడనీ, ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని ఆరోపించింది.

దీనిపై నరేశ్ స్పందిస్తూ.. ఇద్దరి మధ్య పరిచయం ఉన్నది వాస్తవమేనని, ఆమె పెళ్లి చేసుకున్నాక తాను దూరమయ్యానని తెలిపాడు. పెళ్లయిన ఐదు రోజుల తర్వాత ఆమే తనకు ఫోన్ చేసిందనీ, ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తనకు తెలియదని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా, ఆమెపై న్యూసెన్స్ కేసు కూడా పెట్టాడు. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందిస్తూ.. తమకు యువతి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఒకవేళ యువతి ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Mon, Sep 10, 2018, 02:21 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View