దోమలకు విచక్షణ ఏంటి అధ్యక్షా.. అవి మిమ్మల్నీ కుడతాయి!: విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలకు అసెంబ్లీలో నవ్వులు
Advertisement
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ‘దోమలపై దండయాత్ర’ కార్యక్రమంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడారు. మంత్రులు, అధికారులు ఎంత కష్టపడి పనిచేసినా దోమలపై దండయాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని రాజు తెలిపారు. రాష్ట్రంలో 2,80,000 మందికి జ్వరాలు వచ్చాయనీ, వీరిలో తన కుమారుడు కూడా ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో నవ్వులు పూయించాయి.

ఈ రోజు అసెంబ్లీలో చర్చ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. ‘దోమలకు విచక్షణ ఏమీ ఉండదు అధ్యక్షా. అవి అందరినీ కుట్టేస్తున్నాయ్. అధ్యక్షా.. ఇంతకు ముందు మా కామినేని శ్రీనివాస్‌ ఆరోగ్య మంత్రిగా ఉండేవారు. ఆయన పదవి నుంచి తప్పుకోగానే ప్రజలపై దోమల పోరాటం ఎక్కువైపోయింది. అధ్యక్షా (స్పీకర్) మీరు కూడా డాక్టరే.. మిమ్మల్ని కూడా దోమలు కుట్టేస్తాయ్. అసలు ఇది మంత్రికి సంబంధించిన విషయమా? లేక మున్సిపాలిటీకి సంబంధించిన విషయమా?’ అని వ్యాఖ్యానించారు. ఈ మాటలకు అసెంబ్లీలోని సభ్యులందరూ గొల్లున నవ్వారు. అనంతరం విష్ణుకుమార్ రాజు మళ్లీ మాట్లాడుతూ.. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోకుంటే రాష్ట్రంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడతారని హెచ్చరించారు.
Mon, Sep 10, 2018, 02:03 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View