మోదీ నిజమే చెప్పారు.. 70 ఏళ్లలో జరగనివి ఈ నాలుగేళ్లలో జరిగాయి: రాహుల్ గాంధీ ఎద్దేవా
Advertisement
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విపక్ష పార్టీలు చేపట్టిన భారత్ బంద్ కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక రూపు దాల్చుకుంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ తాను ముందుండి బంద్ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీని ఆయన గబ్బర్ సింగ్ ట్యాక్స్ గా అభివర్ణించారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్ పేరుతో ఐదు రకాల పన్నులను వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

మోదీ నాలుగేళ్ల పాలనలో సామాన్యులు చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. రైతుల నుంచి, యువత నుంచి దోచుకున్న మోదీ... దాన్ని తన మిత్రుడికి ఇచ్చారని విమర్శించారు. బీజేపీకి ప్రజా శ్రేయస్సు పట్టడం లేదని... అందరం కలసి మోదీ పాలనకు అంతం పలుకుదామని పిలుపునిచ్చారు.

పెరుగుతున్న పెట్రోల్ ధరలు, మహిళలపై జరుగుతున్న దాడులు, రైతుల దీన స్థితిపై మోదీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని రాహుల్ మండిపడ్డారు. 70 ఏళ్లలో జరగనిది తన నాలుగేళ్ల పాలనలో జరిగిందని మోదీ చెప్పిన మాటలు ముమ్మాటికీ నిజమేనని... గత 70 ఏళ్లుగా జరగని దారుణాలన్నీ ఈ నాలుగేళ్లలో జరిగాయని ఎద్దేవా చేశారు. 
Mon, Sep 10, 2018, 12:54 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View