భారత్ బంద్ హింసాత్మకం... పెట్రోలు బంకుల విధ్వంసం, రద్దయిన రైళ్లు!
Advertisement
కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు నేడు జరుగుతున్న భారత్ బంద్ పలు రాష్ట్రాల్లో హింసాత్మకంగా మారింది. చాలా చోట్ల విపక్ష పార్టీల నిరసనకారులు విధ్వంసాలకు దిగారు. ఆకాశానికి చేరిన పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, రోడ్డెక్కిన నిరసనకారులు, పలు ప్రాంతాల్లో పెట్రోలు బంకులపై రాళ్లు విసిరారు.

గుజరాత్ లోని భారుచ్ లో నిరసనకారులు బస్సుల టైర్లకు నిప్పంటించారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఓ పెట్రోలు బంకును నాశనం చేశారు. ఒడిశాలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జన్ అధికార్ పార్టీ లోక్ తాంత్రిక్ కార్యకర్తలు పాట్నా, రాజేంద్ర నగర్ టర్మినల్ లో రైళ్లను అడ్డుకున్నారు. బీహార్ లో రోడ్లపైకి వచ్చిన ప్రభుత్వ వాహనాలను నిరసనకారులు ధ్వసం చేశారు.

ముంబైలోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. అంధేరీ రైల్వే స్టేషన్ ను ముట్టడించిన నిరసనకారులు, రైళ్లను అడ్డుకున్నారు. మరోపక్క, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ 12 రైళ్లను క్యాన్సిల్ చేసింది. వీటిల్లో భువనేశ్వర్-హౌరా జన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్, విశాఖపట్నం ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ సహా పలు రైళ్లు రద్దయ్యాయి.

కర్ణాటకలో నేడు ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రోడ్డెక్కలేదు. ముఖ్యంగా ఎన్ఈకేఆర్టీసీ (నార్త్ ఈస్ట్రన్ కర్ణాటక రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్) పరిధిలో బంద్ ప్రభావం అధికంగా ఉంది. తెలంగాణలోని భువనగిరి, ముషీరాబాద్ బస్ డిపోల ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించి, బస్సులను అడ్డుకున్నారు. మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు బలవంతంగా షాపులను మూసివేయించారు. ముందు జాగ్రత్త చర్యలుగా పలు ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తును పెంచినప్పటికీ, చాలా చోట్ల విధ్వంసం జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Mon, Sep 10, 2018, 12:49 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View