అతివేగానికి చిన్ని ప్రాణం బలి.. ఆటో, ఫుట్ పాత్ మధ్య నలిగిపోయి బాలుడి మృతి!
Advertisement
అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. వేగంగా వస్తున్న ఆటో అదుపు తప్పి పక్కన నడుచుకుంటూ వెళుతున్న ఓ కుటుంబాన్ని ఢీకొట్టడంతో ఓ పిల్లాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే కుమారుడు విగతజీవిగా మారడంతో తండ్రి ఆ కొడుకును ఎత్తుకుని రోదిస్తున్న వైనం స్థానికులను కలచివేసింది. ఉప్పల్ సమీపంలోని రామాంతపూర్ లో నిన్న ఈ ఘటన చోటుచేసుకుంది.

రామాంతపూర్ లో నివసించే ఉమేశ్ తన భార్యా,పిల్లలతో కలసి నిన్న షాపింగ్ కు బయలుదేరాడు. కుమారుడు మోహిత్(5)తో కలసి ఉమేశ్ ముందు నడస్తుండగా, భార్య, రెండో కుమారుడు వెనుక వస్తున్నారు. ఇంతలో ఎదురుగా రోడ్డుపై ఓ ఆటో వేగంగా వచ్చింది. అయితే రోడ్డుపై వెళుతున్న బైక్ ను తప్పించే క్రమంలో ఆటో డ్రైవర్ వాహనాన్ని పక్కకు కట్ చేయడంతో ఒక్కసారిగా ఆటో వీరిపైకి దూసుకొచ్చింది. పక్కకు ఒరిగిపోతూ ఉమేశ్, మోహిత్ లను ఢీకొట్టింది. ఆటో బలంగా తగలడంతో ఉమేశ్ అల్లంతదూరం ఎరిగిపడగా, మోహిత్ ఆటోకు, ఫుట్ పాత్ కు మధ్య నలిగిపోయాడు. దీంతో ఘటనాస్థలంలోనే పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు.

తీవ్రంగా గాయపడ్డ తండ్రి ఉమేశ్.. చిన్నారి మోహిత్ ను చేతుల్లోకి తీసుకుని రోదించడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటనకు సంబంధించి ఆటో డ్రైవర్ శివ(21)ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Mon, Sep 10, 2018, 11:28 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View