దుఃఖాన్ని దిగమింగుకుని.. డ్రగ్స్ ఓవర్ డోస్‌తో చనిపోయిన తన కుమార్తె వార్తను చదువుకున్న న్యూస్ యాంకర్!
Advertisement
బహుశా ఆమె ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించి ఉండదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో ఘటనలను ప్రపంచానికి వెల్లడించే ఆ న్యూస్ యాంకర్.. తన సొంత కుమార్తె మృతిని కూడా చదువుకోవాల్సి వచ్చింది. డ్రగ్స్ ఓవర్ డోస్‌తో మరణించిన ఆమె గురించిన వార్తను దుఃఖాన్ని దిగమింగుకుని చదివింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తున్న వారి మనసులు కూడా ద్రవించిపోతున్నాయి.

అమెరికాలోని సౌత్ డకోటాకు చెందిన న్యూస్ యాంకర్ ఏంజెలా కెన్నెక్ సీబీఎస్ అనుబంధ కేలో న్యూస్ చానల్‌లో న్యూస్ యాంకర్‌గా పనిచేస్తోంది. డ్రగ్స్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా యాంకర్ ఏంజెలా మాట్లాడుతూ తన 21 ఏళ్ల కుమార్తె ఎమిలీ గ్రోత్ ఎలా చనిపోయిందీ వివరించింది. డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా ఈ ఏడాది మేలో ఆమె మరణించిందని పేర్కొన్న ఏంజెలా.. తన కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నానని, అయినా ఫలితం లేకపోయిందని, డ్రగ్స్‌కు బానిస అయిందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ కథనంలో తన కుమార్తె మరణం గురించి చెప్పుకోవాల్సి వస్తుందని తానెప్పుడూ ఊహించలేదని పేర్కొంది. ఇలాంటి ఘటన ఎవరికైనా ఎదురుకావొచ్చని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుండెల్లో అంతబాధ పెట్టుకుని అవగాహన కల్పిస్తున్న ఆమెను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Mon, Sep 10, 2018, 11:03 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View