పోలీస్ స్టేషన్‌లో ఉత్తరాఖండ్‌ బీజేపీ ఎమ్మెల్యే వీరంగం.. మహిళా ఎస్సైకి హెచ్చరిక!
Advertisement
బీజేపీ ఎమ్మెల్యేల ఆగడాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. మొన్న మహారాష్ట్ర బీజేపీ ఎమ్మల్యే రామ్ కదమ్ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మర్చిపోకముందే ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ తుక్రాల్ పోలీస్ స్టేషన్‌లో వీరంగమేశారు. ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్‌ అనితా డైరోలాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూతులు తిట్టారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. పోలీస్ స్టేషన్‌ ఆవరణలోనే ఇష్టానుసారం మాట్లాడారు.

ఓ వాహనంపై వెళ్తున్న జంటను ఆపిన అనిత వాహన పత్రాలు చూపించమని అడిగారు. వారు చూపించకపోవడమే కాకుండా ఎస్సైను దుర్భాషలాడారు. దీంతో ఆమె వారిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసిన తుక్రాల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి అనితపై రెచ్చిపోయారు. వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. ఈ ఘటనపై సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సదానంద దాతె మాట్లాడుతూ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Mon, Sep 10, 2018, 10:17 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View