శనిని వదిలిస్తానని చెప్పి.. బంగారు నగలతో ఉడాయించిన దొంగబాబా!
Advertisement
అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్లాలే తప్ప దొంగ బాబాలను ఆశ్రయించకూడదని పోలీసులు ఎంత చెప్పినా కొందరు వినడం లేదు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో అనారోగ్యం పేరుతో దొంగ బాబా ఓ కుటుంబానికి కుచ్చుటోపి పెట్టాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వెంకట సుబ్బయ్య భార్యాపిల్లలతో కలసి బెంగళూరులోని దసరహళ్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో అందరి ఆరోగ్యం పాడవడంతో ఓ బాబాను పిలిపించి పూజలు చేయించాలని నిర్ణయించుకున్నారు.

అనుకున్నట్లుగానే ఓ బాబాను పిలిపించారు. వీరి అమాయకత్వాన్ని క్యాష్ చేసుకున్న అతను కుటుంబానికి శని పట్టిందని అందరినీ బెదరగొట్టాడు. దాని ప్రభావంతోనే కుమారుడికి వివాహం కావడం లేదని చెప్పాడు. దాన్ని తొలగించాలంటే పూజ చేయాలనీ, ఇందు కోసం ఇంట్లో ఉన్న విలువైన బంగారం, ఇతర ఆభరాణాలను ఓ బాక్సులో తీసుకొచ్చి తన ముందు పెట్టాలని చెప్పాడు. దీంతో వారు దాదాపు 175 గ్రాముల బంగారాన్ని తీసుకొచ్చి అతని ముందు పెట్టారు.

అనంతరం పూజ చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తూ కొంచెం బియ్యం తీసుకురావాలని కుటుంబ సభ్యులను పురమాయించాడు. దీంతో దంపతులిద్దరూ లోపలకు వెళ్లగానే డబ్బాలో ఉన్న నగలను నొక్కేశాడు. అనంతరం పూజ కానిచ్చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత చూడగా డబ్బాలో నగలు కనిపించకపోవడంతో భార్యాభర్తలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు సదరు దొంగ బాబా ఏపీకి చెందినవాడేనని తెలిపారు. పక్కా రెక్కీ నిర్వహించిన అతను వెంకట సుబ్బయ్య కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకున్నాడని చెప్పారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Mon, Sep 10, 2018, 10:00 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View