కేసీఆర్ అన్నం పెట్టిన దేవుడు.. ఈ ఎన్నికల్లో చెన్నూరు టికెట్ నాదే!: నల్లాల ఓదేలు
Advertisement
చెన్నూరు నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో తాను చురుగ్గా పాల్గొన్నాననీ, తన శ్రమను గుర్తించిన కేసీఆర్ అప్పట్లో స్వయంగా పిలిచి టికెట్ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. నామినేషన్ సమయంలో తన దగ్గర డబ్బులు లేకపోతే కేసీఆరే స్వయంగా డబ్బులిచ్చి ఎన్నికల్లో పోటీ చేయించారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తనకు అన్నం పెట్టిన దేవుడని ఓదేలు చెప్పారు. నిన్న మందమర్రికి చేరుకున్న ఓదేలుకు స్థానికులు, పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

2010 లో పదవులకు రాజీనామా చేయాలని కేసీఆర్ కోరితే వెంటనే చేశామనీ, అప్పట్లో ‘మీ కోసం బావిలో దూకమన్నా దూకుతాను’ అని కేసీఆర్ కు చెప్పానని ఓదేలు తెలిపారు. ఇప్పటికి రెండు సార్లు టీఆర్ఎస్ పార్టీ టికెట్ పై, కేసీఆర్ సాయంతోనే గెలిచానని ఆయన చెప్పారు. ఈసారి కూడా పార్టీ తనకే టికెట్ ఇస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ రావాలంటే కేసీఆర్ సీఎం కావాలని ఓదేలు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంచితే, చెన్నూరు అసెంబ్లీ టికెట్టును ఇప్పటికే బాల్క సుమన్ కు పార్టీ అధిష్ఠానం ప్రకటించిన సంగతి విదితమే!   
Mon, Sep 10, 2018, 09:30 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View