2019లో గెలిస్తే, మరో 50 ఏళ్లు మనమే: అమిత్ షా
Advertisement
2019 ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకమని, ఈ ఎన్నికల్లో గెలిస్తే, మరో అర్ధ శతాబ్దం పాటు అధికారంలో ఉండేది మనమేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు న్యూఢిల్లీలో జరుగుతుండగా, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన అమిత్ షా, బూత్ స్థాయిలో బీజేపీ బలపడాలని సూచించారు. ప్రతి బూత్ లోనూ మెజారిటీ రావాలని, అందుకు తగ్గట్టుగా విధానాన్ని రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా విజయం కోసం కృషి చేయాలని సూచించారు.

ఇదే సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ఓ ప్రభుత్వంగా గతంలో విఫలమైందని, ఇప్పుడు విపక్షంగానూ చతికిలబడిందని విమర్శలు గుప్పించారు. 48 సంవత్సరాల కాంగ్రెస్ పాలన తరువాత, 48 నెలల తమ పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు. ఆ ఫలితం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కనిపించనుందని తెలిపారు.
Mon, Sep 10, 2018, 09:14 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View