గవర్నర్ నరసింహన్ విజ్ఞప్తిని పట్టించుకోని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి.. ఈసారీ పీవోపీ గణనాథుడే!
Advertisement
ప్రకృతి పరిక్షణ కోసం అందరూ మట్టి వినాయకులను నిలబెట్టాలన్న ఉద్యమం గత కొన్ని సంవత్సరాలుగా ఊపందుకుంది. పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం కూడా దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. చాలా సంస్థలు ఎక్కడికక్కడ మట్టి ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఖైరతాబాద్ ఉత్సవ సమితి మాత్రం ఈ విషయంలో తమకు పట్టనట్టు వ్యవహరిస్తోంది.

ఈ ఏడాది మట్టి వినాయకుడిని నిలబెట్టాలంటూ గతేడాది ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితిని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కోరారు. వినాయకుడికి తొలి పూజలు నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఇక్కడ మట్టి గణనాథుడిని నిలబెట్టాలని కోరారు. అయితే, ఆయన సూచనను ఉత్సవ సమితి పెడచెవిన పెట్టింది. ప్రతీ ఏడాదిలానే ఈసారి కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహానికే కట్టుబడింది. 57 అడుగుల పొడవైన సప్తముఖ కాలా సర్ప మహాగణపతి విగ్రహాన్ని రూపొందించింది.

తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ ప్రతిమ అందరినీ ఆకట్టుకుంటుండగా, పర్యావరణ వేత్తలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం తయారీలో ఒక్కోటీ 50 కేజీల బరువున్న 1600 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బ్యాగులను ఉపయోగించారు. అంటే మొత్తం..80 వేల కేజీలన్నమాట. దీనికి అదనంగా 25 టన్నుల ఇనుము, 3 వేల మీటర్ల జనపనార (జ్యూట్), 250 లీటర్ల వాటర్ కలర్స్ (ఎనామిల్ దీనికి అదనం) ఉపయోగించారు. ఇదంతా హుస్సేన్ సాగర్‌లో కలిస్తే పరిస్థితి ఏంటని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, గవర్నర్ సూచనను తాము పెడచెవిన పెట్టామన్న వార్తల్లో నిజం లేదని, భక్తుల డిమాండ్ మేరకే పీవోపీ విగ్రహానికి మొగ్గు చూపామని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి చైర్మన్ సుదర్శన్ తెలిపారు.
Mon, Sep 10, 2018, 08:47 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View