ఉమాను ఓడించాలని జగన్ పట్టుదలగా ఉన్నాడు.. అవసరమైతే కడప నుంచి మనుషులు!: కలకలం రేపుతున్న వసంత ఫోన్‌కాల్!
Advertisement
హోంశాఖ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఓ ఉద్యోగికి ఫోన్ చేసి చేసిన హెచ్చరిక పెను దుమారం రేపుతోంది. మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును ఓడించాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారని, అవసరమైతే కడప నుంచి మనుషుల్ని దింపుతాడంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగికి చేసిన హెచ్చరిక ఫోన్‌కాల్ బయటకు వచ్చి కలకలం రేపుతోంది. కృష్ణా జిల్లా మైలవరం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉమ మరోసారి పోటీకి సిద్ధమవుతుండగా, ఆయనకు ప్రత్యర్థిగా బరిలోకి దిగాలని వసంత కుమారుడు కృష్ణ ప్రసాద్ యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇటీవల గుంటుపల్లిలో వైసీపీ కట్టిన ఫ్లెక్సీలను పంచాయతీ సిబ్బంది తొలగించారు. ఈ విషయాన్ని నేతలు వసంతకు, ఆయన కుమారుడు కృష్ణప్రసాద్‌కు తెలియజేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వసంత నాగేశ్వరరావు ఈ నెల 7 రాత్రి గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి ఎన్‌వీ నరసింహారావుకు ఫోన్ చేసి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.  

తొలుత తానెవరినో పరిచయం చేసుకున్న వసంత పిల్లలు ఎక్కడున్నారు, ఎలా చదువుతున్నారని ప్రశ్నించారు. అనంతరం గొంతు పెంచి హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే మర్డర్లకు కూడా వెనుకాడకూడదని మా వాడు కృష్ణప్రసాద్ గట్టి పట్టుదలగా ఉన్నాడని, ఒకరిద్దరిపై ఎటాక్‌కు సిద్ధమని కూడా పేర్కొన్నారు. జగన్ కూడా ఈ విషయంలో ఇంట్రెస్ట్‌గా ఉన్నాడని, అవసరమైతే కడప నుంచి మనుషుల్ని దించాలని అనుకుంటున్నాడని బెదిరించారు. టీడీపీ ఏజెంట్‌గా పనిచేయడం మానుకోవాలని హెచ్చరించారు. పంచాయతీ రాజ్ కమిషనర్ తన స్నేహితుడేనని, అతడికి చెప్పి ట్రాన్స్‌ఫర్ చేయిస్తానని, లేదంటే విచారణ జరిపించేలా చేయించవచ్చని, కానీ తాను అంతదూరం ఆలోచించడం లేదన్నారు.  

చంద్రబాబు గుంటూరు-2 టికెట్ ఇస్తానన్నా, జగన్ బెజవాడ ఎంపీ టికెట్ ఇస్తానన్నా కృష్ణ ప్రసాద్ వెళ్లలేదని, ఉమా మీద పోటీ చెయ్యాలని పట్టుదలగా ఉన్నాడని పేర్కొన్నారు. తానైతే ఓ పద్ధతిగా ఉంటానని, తన కుమారుడు మాత్రం మొండి యవ్వారం చేస్తాడంటూ హెచ్చరించారు.  ఇకనైనా జాగ్రత్తగా ఉంటే మంచిదని బెదిరించి ఫోన్ పెట్టేశారు. కాగా, తనకు ఫోన్ చేసి బెదిరించిన వసంతపై పంచాయతీ కార్యదర్శి నల్లాని వెంకట నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని అందులో పేర్కొన్నారు.
Mon, Sep 10, 2018, 07:50 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View