సర్వే నివేదికను బాల్క సుమన్ తారుమారు చేశాడు: టీఆర్ఎస్ నేత ఓదేలు
Advertisement
మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు టికెట్ తనకు కేటాయించకపోవడంపై తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బాల్క సుమన్ పేరును ఇటీవల ప్రకటించడంపై ఆయన మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మందమర్రిలో తన అనుచరులతో కలిసి ఈరోజు ఆయన సమావేశమయ్యారు.

 ఈ సందర్భంగా ఓదేలు మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన సర్వే అరవై శాతం తనకు అనుకూలంగా వచ్చిందని, అయితే, ఈ నివేదికను బాల్కసుమన్ తారుమారు చేసి టీఆర్ఎస్ అధిష్ఠానానికి తప్పుడు నివేదికను పంపారని ఆరోపించారు. బాల్క సుమన్ తో కలిసి పని చేస్తానని తానెన్నడూ చెప్పలేదన్న ఓదేలు, ఈ నియోజకవర్గ టికెట్ ను తిరిగి తనకే ఇస్తారని తన అనుచరులతో ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.

కాగా, ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీ గా బాల్క సుమన్ ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో చెన్నూరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు.
Sun, Sep 09, 2018, 08:24 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View