తెలంగాణలో టీడీపీ-సీపీఐ పొత్తు ఖరారు!
Advertisement
తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీటీడీపీ- సీపీఐ పొత్తు ఖరారు అయింది. ఈ రెండు పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు సమావేశమయ్యారు. ఇరు పార్టీల మధ్య పొత్తు అంశంపై చర్చించారు.

అనంతరం, మీడియాతో రమణ మాట్లాడుతూ, రేపు, ఎల్లుండి మిగతా పార్టీలతో మాట్లాడనున్నామని అన్నారు. మంచి వాతావరణంలో తాము చర్చించుకున్నామని, రానున్న రోజుల్లో మహాకూటమి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏఏ పార్టీలైతే తమతో పొత్తుకు ఆసక్తి చూపుతున్నాయో వాళ్లతో చర్చలు పెడుతున్నామని, భావసారూప్యత ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ తాము ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాజకీయ, నైతిక విలువలు లేవని, అన్ని పార్టీలకు చెందిన నేతలను నిస్సిగ్గుగా కలుపుకొన్నారని, ఇది కేసీఆర్ మార్క్ రాజకీయమని విమర్శించారు. తెలంగాణలో ఆదర్శవంతమైన పాలన అందిస్తానని చెప్పిన కేసీఆర్, అలాంటి పాలన అందించలేదని.. పేదల గొంతు నొక్కుతున్న పరిపాలన కేసీఆర్ దని విరుచుకుపడ్డారు. తెలంగాణలో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమని అన్నారు.

మహాకూటమి కావాలనుకుంటున్నాం: చాడ వెంకటరెడ్డి

మహాకూటమి కావాలనుకుంటున్నామని, తమతో ఇంకా కలిసి వచ్చే పార్టీలతో కూడా మాట్లాడతామని చాడ వెంకటరెడ్డి తెలిపారు. భేటీ అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తాము గెలిచే స్థానాలే అడుగతామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి అధికారమే తప్ప, రైతు సమస్యలు ముఖ్యం కాదని విమర్శించారు. ప్రధాన శత్రువుగా టీఆర్ఎస్ నే చూడాలని తాము నిర్ణయించుకున్నామని, ఎన్నికల గురించి ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీతో తాము మాట్లాడలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

‘ఛలో ప్రగతి భవన్’ చేపడతాం: టీడీపీ నేత పెద్దిరెడ్డి

కేసీఆర్ కు సభలపై ఉన్న ఆసక్తి తప్ప, రైతు పంటలపై లేదని టీ-టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి విమర్శించారు. దిగువ పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చాయని, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) నుంచి పంటలకు నీరు విడుదల చేయాలని రైతులందరూ ఆందోళన చేస్తున్నారని అన్నారు. వెంటనే ఎస్సారెస్పీ నుంచి దిగువ మానేరుకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో ‘ఛలో కలెక్టరేట్’ ‘ఛలో ప్రగతి భవన్’ కార్యక్రమాలు చేపట్టి, కేసీఆర్ ని నిలదీసేందుకు రైతాంగం సిద్ధంగా ఉందని అన్నారు.  
Sun, Sep 09, 2018, 07:35 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View