కడప జడ్పీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత!
Advertisement
జిల్లా పరిషత్ తో ఏమాత్రం సంబంధం లేని ఆప్కో చైర్మన్ సర్వసభ్య సమావేశానికి రావడం, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రశ్నించడంతో, కడప జిల్లా పరిషత్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. తెలుగుదేశం, వైకాపా ప్రతినిధులు ఒకరిని ఒకరు దూషించుకోవడంతో సభ రసాభాసైంది. ఆప్కో చైర్మన్ ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తూ, వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు రవీంద్రనాథ్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు నిరసన తెలుపుతూ, వేదికపై బైఠాయించగా, గొడవ మొదలైంది. కరవు రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తూ, ప్లకార్డులను ప్రదర్శించగా, వేదిక వద్దకు వచ్చిన మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు.

కరవుపై సమాధానం చెప్పాలని సోమిరెడ్డిని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నిలదీయగా, సోమిరెడ్డి సైతం ఘాటుగా స్పందించారు. సాఫీగా సాగుతున్న చర్చను వైకాపా నేతలు కావాలనే అడ్డుకుంటున్నారని సోమిరెడ్డి అనడంతో, నేతల మధ్య వాగ్వాదం మరింతగా పెరిగింది. నెల రోజుల క్రితం పంటలను సోమిరెడ్డి స్వయంగా పరిశీలించిన విషయాన్ని ప్రస్తావించిన శ్రీకాంత్ రెడ్డి, ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. ఈ సమయంలో కల్పించుకున్న పోలీసులు, ఇరు వర్గాల వారికీ నచ్చజెప్పి ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేశారు.
Sun, Sep 09, 2018, 12:13 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View