తల్లి బతికివస్తుందని.. మృతదేహానికి 7 నెలలుగా తాంత్రిక పూజలు!
Advertisement
మూఢనమ్మకాలు మనుషులను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో తెలియజెప్పే ఘటన ఇది. చనిపోయిన తన తల్లి బతుకుతుందని నమ్ముతూ కొన్ని నెలలుగా ఓ కుమారుడు తాంత్రిక పూజలు చేయడం మొదలుపెట్టాడు. తల్లి తనతో మాట్లాడుతోందని తండ్రిని కూడా నమ్మించాడు. దీంతో తండ్రీకొడుకులు కలసి పూజలు చేయడం ప్రారంభించారు. చివరికి ఓ సమీప బంధువు ఇంటికి రావడంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది.

ఛత్తీస్ గఢ్ లోని విశ్వంపూర్ గ్రామంలో శోభ్ నాథ్ గోండ్, కాళేశ్వరి దంపతులకు అరికన్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనారోగ్యంతో కాళేశ్వరి కన్నుమూసింది. దీంతో కుమారుడు సింగ్ తల్లిని తాంత్రిక పూజలతో బతికించుకుందామని తండ్రిని ఒప్పించాడు. అంత్యక్రియలు చేయకుండా తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచుకుని గత 7 నెలలుగా తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నాడు. కాళేశ్వరి తనతో మాట్లాడుతోందని సింగ్ చెప్పేవాడు. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం వీరి బంధువు ఒకరు విశ్వంపూర్ కు రావడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించాడు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తల్లి తనతో మాట్లాడుతోందనీ, త్వరలోనే బతికివస్తుందని సింగ్ నమ్మేవాడనీ, విచారణలో తమకూ అదే చెప్పాడని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
Sun, Sep 09, 2018, 11:53 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View