భారత్ ను వణికిస్తోన్న ప్రమాదకర బ్యాక్టీరియా.. వారం రోజుల్లోనే 15 మంది మృతి !
Advertisement
ప్రస్తుతం విషజ్వరాలు, అంటు వ్యాధులతో తెలుగు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మన పక్కనే ఉన్న మహరాష్ట్రలో ఇంకో ప్రమాదకరమైన బ్యాక్టీరియా రెచ్చిపోతోంది. దీని కారణంగా జ్వరాలు సోకి కేవలం వారం రోజుల్లోనే 15 మంది మృత్యువాత పడ్డారు. దీంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. స్క్రబ్ టైఫస్ జ్వరంగా పిలుస్తున్న దీనితో మహారాష్ట్రలో మరో 75 మంది ఇంకా చికిత్స పొందుతూ ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఓ రకం కీటకం కుట్టడం కారణంగా ఓరియెన్షియా షుషుగమసి అనే బ్యాక్టీరియా మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తోంది. దీని కారణంగానే స్క్రబ్ టైఫస్ అనే జ్వరం సోకుతుంది. దీని ప్రభావంతో జ్వరం, ఒళ్లు నొప్పులు, చర్మంపై దద్దుర్లు రావడంతో పాటు సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే ప్రాణాలు కోల్పోతారు. తాజాగా గత వారం రోజుల్లో ఓ పురుగు కుట్టడం కారణంగా 90 మందికి ఈ బ్యాక్టీరియా సోకింది. వీరిలో 15 మంది చనిపోగా, మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది.

వీరందరినీ నాగ్ పూర్ లోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ విషయమై నాగ్ పూర్ ఆసుపత్రి సీనియర్ వైద్యుడు డా. అభిమన్యు మాట్లాడుతూ.. స్క్రబ్ టైఫస్ వ్యాధిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేవలం మహారాష్ట్ర నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇదే వ్యాధి లక్షణాలతో తమ ఆసుపత్రిలో చేరుతున్నారని వెల్లడించారు. డెంగీ తరహాలోనే ఈ వ్యాధిని సమర్ధవంతంగా నియంత్రిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
Sun, Sep 09, 2018, 10:26 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View