మాది కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే.. మీకెందుకు సాయం చేయాలి?: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
Advertisement
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఎవరికీ తెలియదు. భారత్ ను పొగిడి.. మళ్లీ అంతలోనే విమర్శిస్తూ కామెంట్లు పెట్టేస్తారు. మరోపక్క, మిత్ర దేశాలకు తాము మిలటరీ రక్షణ కల్పిస్తున్నాం కాబట్టి తమకు నగదు చెల్లించాలని డిమాండ్ కూడా చేసేస్తారు. తాజాగా ట్రంప్ భారత్, చైనాల మీద ఫైర్ అయ్యారు. భారత్, చైనాలు అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పుకుంటూ భారీ సబ్సిడీలు పొందుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. అమెరికా కూడా అభివృద్ధి చెందుతున్న దేశమేననీ, తాము ఇంకా అభివృద్ధి చెందిన దేశం కాలేదని సెలవిచ్చారు. ఉత్తర డకోటా రాష్ట్రంలోని ఫార్గో నగరంలో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు.

భారత్, చైనాలకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదనీ, వీటిని నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా అనవసరంగా విదేశాలకు చేస్తున్న సాయాన్ని నిలిపివేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) చైనా అభివృద్ధి కోసం పనిచేస్తోందని ట్రంప్ ఆరోపించారు. అమెరికా-చైనాల మధ్య ఏటా 500 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడటానికి ఇదే కారణమనీ, దీన్ని తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు.
Sun, Sep 09, 2018, 10:04 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View