ఇక పోరు.. స్వలింగ వివాహాలపై: తదుపరి లక్ష్యాన్ని ప్రకటించిన ఎల్జీబీటీక్యూ
Advertisement
స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన తర్వాత ఇప్పుడు మరో పోరుకు ఎల్‌జీబీటీక్యూ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ అండ్ క్వీర్) వర్గాలు రెడీ అవుతున్నాయి. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377లోని నిబంధనలను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసి చారిత్రక తీర్పునిచ్చింది. ఎల్‌జీబీటీక్యూలకు కూడా ఇతరులతో సమానంగా హక్కులుంటాయని న్యాయస్థానం తన తీర్పులో స్పష్టం చేసింది. కాబట్టి వారికి కూడా పెళ్లి చేసుకునే హక్కు, ఆస్తి హక్కు కూడా వర్తిస్తుందని, ఇకపై ఇందుకోసం పోరాడతామని సెక్షన్ 377 రద్దు కోసం పోరాడిన సునీల్ మెహ్రా తెలిపారు.  

మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారానికి ఇక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తోంది. వివాహాల వరకు వెళ్లకుండా చూడాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆరెస్సెస్ కూడా స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. భారతీయ సమాజం ఇటువంటి వివాహాలను ఆమోదించదని ఆరెస్సెస్ అధికార ప్రతినిధి అరుణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. మరోవైపు, స్వలింగ సంపర్కంపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్.. వివాహాల విషయంలో తమ వైఖరేంటో ఇప్పటి వరకు వెల్లడించలేదు. కేంద్రం తన అభిప్రాయాన్ని వెల్లడించిన తర్వాతే తమ వైఖరేంటో వెల్లడిస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు.
Sun, Sep 09, 2018, 07:49 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View