ఖైదీలను హింసించడం మానుకోకపోతే లారీతో తొక్కించి చంపుతా!: జైళ్లశాఖ ఎస్పీకి గ్యాంగ్ స్టర్ వార్నింగ్
Advertisement
సాధారణంగా పోలీసులు ‘ఇంకోసారి దొంగతనం చేశావో.. జీవితాంతం జైలులో ఉండేలా చేస్తా’ అని చిల్లర దొంగలను బెదిరిస్తూ ఉంటారు. మరికొందరు నాలుగు దెబ్బలు తగిలించి ఆ దారిలోకి పోకుండా ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ తమిళనాడులో మాత్రం సీన్ రివర్స్ అయింది. పోలీస్ అధికారులు అనవసరంగా జైలులోని ఖైదీలను వేధిస్తున్నారనీ, గంజాయి అలవాటు చేస్తూ వారి డబ్బులను దోచుకుంటున్నారని ఓ గ్యాంగ్ స్టర్ ఏకంగా ఎస్పీ స్థాయి అధికారిణికి ఆడియో సందేశం పంపాడు. ఇప్పటికైనా మారకుంటే తన అనుచరులు వదలిపెట్టబోరని హెచ్చరించాడు. లారీతో తొక్కించి చంపుతానని పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఏకంగా ఏస్పీ స్థాయి అధికారిణికే హెచ్చరిక సందేశం రావడంతో సదరు ప్రబుద్ధుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

తమిళనాడు తేని జిల్లాలోని జయమంగళానికి చెందిన బుల్లెట్ నాగరాజన్ పై రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా కేసులు ఉన్నాయి. ఇతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా, 2006లో ఓ వ్యక్తిని హత్యచేసిన కేసులో యావజ్జీవ శిక్షపడిన ఇతని అన్న మధురైలోని సెంట్రల్ జైలులో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మత్తు మందులకు అలవాటు పడిన అతను ట్యాబ్లెట్లు ఇవ్వాలని ఓ మహిళా డాక్టర్ ను మెడికల్ చెకప్ సందర్భంగా కోరాడు.

అందుకు ఆమె అంగీకరించకపోవడంతో రచ్చరచ్చ చేశాడు. చొక్కాను విప్పి మహిళా డాక్టర్ ముఖంపై విసిరాడు. దీంతో కమాండో పార్టీ సాయంతో అధికారులు అతడిని లాకప్ లో పడేశారు. ఈ ఘటనపై మధురై జైళ్లశాఖ ఎస్పీ ఊర్మిళ విచారణ చేపట్టారు. మరోపక్క ఇటీవల ఎంజీఆర్ శతజయంతి సందర్భంగా నాగరాజన్ అన్న విడుదలయ్యాడు. సోదరుడి వద్దకు వెళ్లి జైలులో జరిగిన తతంగం మొత్తాన్ని వివరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన నాగరాజన్ ఎస్పీ ఊర్మిళ, ట్రీట్ మెంట్ చేసిన సదరు మహిళ డాక్టర్ కు వాట్సాప్ లో వార్నింగ్ ఇచ్చాడు.

‘గ్రేట్‌ జనరల్‌ బుల్లెట్‌ నాగరాజన్‌ను మాట్లాడుతున్నా. తమిళనాడులో నేను చూడని జైలు లేదు. మీరు ఎంతో మంది ఖైదీలను హింసిస్తున్నారు. మధురై జైలుకు సంబంధించి మీకు నిర్వాహణ సామర్థ్యమే లేదు. ఖైదీలను కొట్టేందుకే కమాండో పార్టీలను పెట్టుకున్నారు. ఖైదీలను కొట్టిన ఒకేఒక కారణంతో జైలర్‌ జయప్రకాశ్ ను  సజీవదహనం చేసిన విషయం మరచిపోయారా? ప్రస్తుతం మేం మా నడతను మార్చుకుని సమాజంలో పెద్దమనుషులుగా చలామణి అవుతున్నాం.

ఖైదీలతో ఏదైనా సమస్య వస్తే మీరు ఏం చేస్తారో మిమ్మల్ని మేమూ అదే చేయాల్సి వస్తుంది. మనిషికి ఎప్పుడైనా చావు రావొచ్చు. దాని గురించి నాకు భయం లేదు. నేను పాత బుల్లెట్‌ నాగరాజన్‌కు కాదు. జైల్లో విధులు ముగించుకుని మీరు బైటకు వచ్చి తీరాలి కదా. నేనేమీ చేయకపోయినా నా అనుచరులు ఊరుకోరు. లారీ మీ మీద ఎక్కవచ్చు.. ఇప్పటికైనా మారండి’ అంటూ వాట్సాప్ లో హెచ్చరించాడు. కాగా, సాక్షాత్తూ ఎస్పీ స్థాయి అధికారిణికే బెదిరింపులు రావడంతో నాగరాజన్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు.
Sat, Sep 08, 2018, 04:08 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View